అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్‌ఎస్‌లో 102 వినతుల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పరిష్కరించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి 102 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు అర్జీల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి, డీఆర్డీఏ ఏడీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే...
● ఇటీవల వచ్చిన మెంథా తుఫాన్‌కు ప్రభుత్వం అందజేసిన బియ్యం, ఇతర పప్పులు వంటివి చాలా మందికి అందలేదని లావేరు మండలంలోని పాతకుంకాం గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 70 కుటుంబాల చేనేత కార్మికులు ఉండగా, వీరిలో 44 మందికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
● నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలో ఆక్రమణలు తొలగించాలని నరసన్నపేట మండల పరిషత్ అధ్యక్షుడు ఆరంగి మురళీధరరావు కోరారు. మెయిన్‌రోడ్డులో పలువురు నివాసం కోసం అనుమతులు తీసుకుని, వాణిజ్య సముదాయాలు నిర్మించుకుంటూ పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని తెలిపారు. ఆయనతో పాటు రఘుపాత్రుని శ్రీధర్, రౌతు శంకరరావు ఉన్నారు.
● చిత్రారాపు వందన కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత ప్రజా సంఘాల జేఏసీ నాయకులు కలెక్టర్‌కు విన్నవించారు. లోలుగు కేజీబీవీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చిత్తరపు వందన స్పెషల్ ఆఫీసర్ సీపాన లలిత కుమారి వేధింపులు తట్టుకోలేక సెప్టెంబర్ 19వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. దీనికి ప్రధాన కారణమైన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చర్యలు తీసుకోవాలి
ఆమదాలవలస మండలంలోని రామచంద్రాపురంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. వాస్తవానికి నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలంను కేటాయించిందని, అయితే ఆ స్థలాన్ని గార అప్పన్న అనే వ్యక్తి కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం నుంచి స్టే తీసుకువచ్చారని, వాటిని ప్రభుత్వం తరుపునుంచి వెకెట్ చేయించి, ఆస్పత్రి నిర్మాణం జరిగే విధంగా చూడాలని కోరారు. అలాగే బూర్జ మండలంలో జంగాలపాడు పంచాయతీలోని జంగాలపాడు, మశానపుట్టి, బొడ్లపాడు తదితర గిరిజన గ్రామాలకు గతంలో కొంతమేర తారు రోడ్డు వేయడం జరిగిందని, మిగిలిన రోడ్డును పూర్తి చేయాలని విన్నవించారు. జంగాలపాడు గ్రామానికి చెందిన సవర పున్నమ్మకు చంద్రన్న బీమాను మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా పొందూరు మండలంలోని రాపాక గ్రామంలో గత నాలుగు నెలలుగా జేజేఎం పనులు జరుగుతున్నాయని, అయితే ఆ పనులతో పాటు ఆ గ్రామంలో సీసీ రోడ్డులు కూడా పూర్తి చేయాలని కోరారు. ఆయనతో పాటు బి.సురేష్, రాపాక సర్పంచ్ కె.వనజ తదితరులు ఉన్నారు.


