ఎస్పీ గ్రీవెన్సుకు 53 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమానికి (గ్రీవెన్సు) 53 వినతులు వచ్చాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సకాలంలో న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.
సత్తాచాటారు..!
● కబడ్డీ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు
● విజేతగా బాలికల జట్టు, రన్నరప్‌గా నిలిచిన బాలురు జట్టు
శ్రీకాకుళం న్యూకాలనీ: కబడ్డీలో శ్రీకాకుళం జిల్లా మరోసారి మెరిసింది. ఈ ఏడాది జరిగిన కొత్త సీజన్‌లోను విజయదుందుభి మోగించింది. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల వేదికగా ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 35వ ఏపీ రాష్ట్రస్థాయి బాలబాలికల సబ్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అత్యద్భుతమైన ఆటతీరుతో రాణించి శ్రీకాకుళం బాలబాలికల జట్లు విజయబావుటా ఎగురవేశాయి. అనంతపురం జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో శ్రీకాకుళం బాలికల జట్టు గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. అలాగే బాపట్ల జిల్లాతో జరిగిన ఫైనల్ పోరులో శ్రీకాకుళం బాలురు జట్టు స్వల్ప తేడాతో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ రెండు జట్లకు కోచ్, మేనేజర్లగా ఎం.వెంకటరావు, డి.శ్యామ్, కాంతారావు, ఝాన్సీ వ్యవహరించి జిల్లా జట్లను ముందుండి నడిపించారు. క్రీడాకారుల రాణింపుపై శ్రీకాకుళం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ఎమ్మెల్యే గోండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ. ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాదు శ్రీనివాసరావు, కోశాధికారి నగాల్ల రమేష్, డీఎస్‌డీవో ఎ.మహేష్‌బాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


