ఉద్యోగ వేటలో ఓడిపోయాను క్షమించండి
గార: ఉద్యోగం సాధించి అమ్మను బాగా చూసుకుంటానని ఎన్నో కలలు కన్నాడు. తోటి స్నేహితులు ఎప్పుడు ఫోన్ చేసినా ఉద్యోగం సంపాదిస్తానని చెప్పేవాడు. మూడేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, తనను క్షమించాలని కోరుతూ సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొర్లాం గ్రామానికి చెందిన సల్ల సంపత్‌కుమార్ (32) ఎంబీఏ పూర్తి చేశాడు. విశాఖపట్నంలోని ద్వారకానగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అమ్మ అనారోగ్యం కూడా తోడవ్వడంతో కుటుంబానికి భారం కాకూడదని భావించినట్లు ఉన్నాడు. ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు గురయ్యి ఆదివారం రాత్రి తన గదిలో ఉరేసుకొని చనిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు సోమవారం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. సంపత్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


