ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో కారు
● అక్కడికక్కడే మెకానిక్ మృతి
● మరో ముగ్గురికి గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారిపై కోమర్తి వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దపాడుకు చెందిన కోరాడ వెంకటరావు (25) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే సంతబొమ్మాళి మండలం పాలతలగాంకు చెందిన ఆవల సంతోష్, సుశీల, కార్ మెకానిక్ అసిస్టెంట్ ఎస్.కృష్ణలకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సతివాడకు చెందిన షన్ముఖరావు కారులో తన స్నేహితులతో కలిసి టెక్కలి వెళ్తుండగా కోమర్తి వద్దకు వచ్చేసరికి కారు ఆగిపోయింది. దీంతో మరో వాహనంలో వీరు టెక్కలి వెళ్తూ శ్రీకాకుళంలోని కారు మెకానిక్ కోరాడ వెంకటరావుకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం సమయంలో కారు మెకానిక్ వెంకటరావు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. అనంతరం ఆగిన కారుకు మరమ్మతులు చేస్తుండగా, శ్రీకాకుళం నుంచి అతివేగంగా వచ్చిన మరో కారు ఆగి ఉన్న కారును ఢీకొంది. దీంతో కారు రిపేర్ చేస్తున్న కోరాడ వెంకటరావు తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆవల సంతోష్, సుశీలతో పాటు మెకానిక్‌కు అసిస్టెంట్‌గా వచ్చిన కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతుడు పెద్దపాడు గ్రామంలో నివసిస్తూ శ్రీకాకుళంలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడికి తల్లి, తండ్రి, సోదరి ఉన్నారు.
ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో కారు


