
సర్వం స్వాహార్పణం
చెరువులు..శ్మశానం
● నక్కపేటలో ఆక్రమణలు
● కబ్జాతో కనుమరుగవుతున్న చెరువులు
● సాగునీరు అందక రైతులు ఇబ్బందులు
● శ్మశాన వాటికను వదలని ఆక్రమణదారులు
● దహన సంస్కారాలకు ఇబ్బందులు
పడుతున్న పరిస్థితులు
● అధికారులకు ఫిర్యాదు చేసినా.. సీఎంకు ఫిర్యాదులు వెళ్లినా స్పందన శూన్యం
ఆక్రమణలో ఉన్న మర్రి బంద చెరువు గట్టుపై వేసిన పశువుల పాకలివి. సర్వే నంబరు 236లో ఉందీ స్థలం. దీని విస్తీర్ణం 4.32 ఎకరాలు. కొంత మంది చెరువును కప్పేసి పొలాలుగా మార్చారు. చెరువు మదుములు పూడ్చేశారు. చెరువు చప్టాను పొడిచేశారు. అలాగే చెరువు గట్టుపై మూగజీవాల కోసం పాకలు వేసుకున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జి.సిగడాం మండలం సీతంపేట పంచాయతీ నక్కపేట గ్రామంలో సాగునీటి చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. ఆక్రమించిన చెరువు గర్భంలో మట్టి వేసి పొలాలుగా మార్చుకుని సాగు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో చెరువులు కుచించుకుపోయాయి. చెరువులు కాస్త చిన్న మురికి కాలువలుగా మారిపోతున్నాయి. సాగునీటి అవసరాల కోసం పెద్దలు చెరువులు తవ్విస్తే వాటినే కబ్జా చేసి పొలాలుగా మార్చుకుంటున్నారు. ఈ గ్రామంలో కళ్ల ముందే మర్రిబంద చెరువు, గుంటుకువాని చెరువు ఆక్రమణలకు గురైనట్టు కనబడుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. చివరికి కలెక్టర్‌కు, సీఎంకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. గతంలో ఒకసారి ఆక్రమణదారుల నోటీసుల డ్రామా నడిచినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో తెలీదు గానీ ఆక్రమణలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ జరగలేదు.
శ్మశానాలకు సమాధి... ఆక్రమణలకు పునాది
గ్రామంలో చెరువులే కాదు.. ఆ చెరువుల మధ్య ఉన్న శ్మశాన వాటిక భూమిని కూడా ఆక్రమించేశారు. సాధారణంగా శ్మశానాల జోలికి వెళ్లడానికి భయపడతారు. కానీ, ఇక్కడేంటో శ్మశానాలను సైతం వదల్లేదు. మర్రిబంద చెరువు, గుంటుకువాని చెరువు మధ్య ఉన్న ఐదెకరాల శ్మశానంలోనూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తమకు అనుకూలంగా మార్చుకుని అనుభవిస్తున్నారు. దీంతో శ్మశానం వాటిక కూడా ఆక్రమణదారుల చేతిలో చిక్కుకుపోయింది. ఇక్కడ ఒక్కో ఎకరం విలువ రూ.30లక్షలు దాటి ఉంటుంది. ఈ లెక్కన ఆక్రమణదారులు కబ్జా చేసిన చెరువు, శ్మశాన వాటిక భూముల విలువ రూ. కోట్లలో ఉంటోంది.
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పరిస్థితి
చెరువులు, శ్మశాన వాటిక ఆక్రమణలకు గురయ్యాయని అటు తహసీల్దార్, కలెక్టర్‌కు, ఇటు సీఎంకు ఫిర్యాదు చేసినా స్పందన ఉండటం లేదు. దీన్ని బట్టి ఇక్కడ ఆక్రమణల వెనక ఎవరున్నారో స్పష్టమవుతోంది. కొంతమంది మాత్రం పశువుల పాకలు వేసుకున్నామని, వాటిని తొలగిస్తే మరొకచోట పశువుల శాలకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదొక సమస్యగా మారడంతో అధికారులు సైతం ఊగిసలాట ఆడుతున్నారు.

సర్వం స్వాహార్పణం

సర్వం స్వాహార్పణం

సర్వం స్వాహార్పణం