
నేడు, రేపు పీడీ–పీఈటీల జిల్లాస్థాయి సెమినార్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న పీడీ, పీఈటీల సెమినార్ కమ్ వర్క్‌షాప్ శుక్ర, శనివారం రెండు రోజులపాటు జరగనుందని డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి తెలిపారు. నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా గురువారం ఉదయం 9 గంటలకు మొదలవుతుందని వారు చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు, ఒలింపిక్ సంఘ నాయకులు, కలెక్టర్ వంటి ప్రముఖులు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. మారిన క్రీడాపాలసీ, నూతన క్రీడా విధానాలు, స్కూల్‌గేమ్స్, గ్రిగ్స్‌మీట్ పోటీల నిర్వహణ, వేదికలు ఖరారు చేయడం, పాఠశాలల్లో నమోదు చేయనున్న క్రీడా రిజిస్టర్లు తదితర అంశాలపై ఈ సెమినార్‌లో నిష్ణాతులైన వక్తలతో అవగాహన కల్పించనున్నట్టు డీఈఓ తెలిపారు.
సమన్వయమే కీలకం: జేసీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: సునామీ వంటి విపత్తుల సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల మ ధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. తీరప్రాంత గ్రామాల్లో సునామీ ప్రభావం ఎక్కువ గా ఉంటుందని, మత్స్యకారుల కుటుంబాలు, వారి వలలు, పడవలు, ఇతర ఆస్తులకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖలు పాటించాలన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (విపత్తుల నిర్వహణ) రాము మాట్లాడుతూ, తుఫానుల సమయంలో తుఫా ను ఆశ్రయ కేంద్రాలను ఉపయోగిస్తామని, అయితే సునామీ వంటి పరిస్థితుల్లో అవి కూడా సురక్షితం కానందున బాధితులను తరలించడానికి ప్రత్యేకమైన, సురక్షితమైన ప్రాంతాలను గుర్తించాలని కోరారు. ఆర్టీఓ గంగాధర్ మాట్లాడుతూ, ప్రజలను తరలించడానికి సరైన ప్రణాళికను రూపొందించామని, తక్షణ చర్యలకు ఎలాంటి జాప్యం జరగదని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ జిల్లా సహాయ ఫైర్ అధికారి శ్రీనుబాబు మాట్లాడుతూ, సునామీకి ముందు, సునామీ సమ యంలో, సునామీ తదుపరి నిర్వహించాల్సిన కార్యక్రమాలను శాఖాపరమైన ప్రామాణిక పద్ధతుల ద్వారా అన్ని శాఖల సమన్వయం, సహకారంతో స్పందించేందుకు ఏర్పాట్లు, పరికరాలు సమకూర్చుకున్నామని తెలియజేశారు.
హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్‌ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో ఇస్తున్న శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఇన్‌చార్జి జిల్లా ప్రజా రవాణా అధికారి హనుమంతు అమరసింహుడు కోరారు. శ్రీకాకుళం ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 22 వ బ్యాచ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. తదుపరి 23 వ బ్యాచ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఫీజు, ఇతర వివరాలకు 7382921733 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
అన్నదాత సుఖీభవకు రూ.184 కోట్లు
● ఆగస్టు 2న జిల్లా వ్యాప్తంగా పంపిణీ
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 2,74,301 మంది రైతులకు రూ.184 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆగస్టు 2న జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు నేరుగా నగదు మంజూరు చేస్తామని వెల్లడించారు. గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆగస్టు 2న ప్రతి గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించి, అర్హులైన రైతులకు లబ్ధి అందించాలన్నారు. రైతులు తమ అర్హతను తెలుసుకోవడానికి ‘అన్నదాత సుఖీభవ పోర్టల్’ లేదా ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌ను వినియోగించుకోవాలన్నారు. ఆధార్–బ్యాంక్ ఖాతా అనుసంధానం వంటి పెండింగ్ అంశాలు పూర్తిచేసుకోవాలని సూచించారు.

నేడు, రేపు పీడీ–పీఈటీల జిల్లాస్థాయి సెమినార్