ధర్మవరం: రైలులో హ్యాండ్ బ్యాగ్, సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వ్యక్తికి ధర్మవరం రైల్వే పోలీసులు బాధితుడికి అందజేశారు. ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్‌లో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ షణ్ముకానందరెడ్డి, కానిస్టేబుల్ రుక్సానా, రైల్వే స్వీపర్ ప్రసన్నలక్ష్మి బాధితుడికి బ్యాగు, 3 సెల్‌ఫోన్లు అందించారు. వైఎన్‌ఎస్ కోటకు చెందిన ఫయాజ్‌బాషా నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి నరసాపూరు ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తున్నాడు. మదనపల్లి రైల్వేస్టేషన్ దగ్గర హ్యాండ్‌బ్యాగ్, అందులో మూడు సెల్‌ఫోన్లు, ఆధార్‌కార్డులు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని వెంటనే ధర్మవరం రైల్వే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. రైలు ధర్మవరానికి చేరుకోగానే జీఆర్‌పీ పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫారం –4లో ఆగిన రైలులో బ్యాగు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్వీపర్లను వెతకమని పంపించగా రైలులోని ఎస్–2 కోచ్ బాత్‌రూం సమీపంలో హ్యాండ్‌బ్యాగ్, సెల్‌ఫోన్లు దొరికాయి. వాటిని బాధితుడు ఫయాజ్‌బాషాకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
బత్తలపల్లి: అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి బైపాస్ వై జంక్షన్ క్రాసులో ఆదివారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కదిరి దిగువపల్లికి చెందిన కాయల ఉదయ్‌కిరణ్, కాయల బాబు అనంతపురానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న కారు బత్తలపల్లి బైపాస్‌లోని వై జంక్షన్ వద్ద ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.
హమ్మ దొంగా!
● కిక్ సినిమా తరహాలో దొంగతనం
● షాపింగ్ మాల్స్‌ను కొల్లగొట్టిన దొంగ
● డ్రస్ సర్కిల్‌లో లాకర్‌ను ఎత్తుకెళ్లిన వైనం
అనంతపురం సెంట్రల్: నగరంలో ఓ దొంగ కిక్ సినిమాలో హీరో తరహాలో దొంగతనాలు చేశాడు. ముఖానికి జోకర్ మాస్క్ వేసుకొని పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా దొంగతనాలు చేస్తాడు. అచ్చం అలాగే నగరంలో ఓ దొంగ షాపింగ్ మాల్స్‌ను కొల్లగొట్టాడు. నగరంలోని కమలానగర్‌లోని ఒకేరోజు రాత్రి పలు షాపులు, షాపింగ్ మాల్స్‌లోకి చొరబడ్డాడు. తొలుత ఓ టీస్టాల్ భవనం ఎక్కి పీఎస్‌ఆర్ వస్త్ర దుకాణంలో వెళ్లాడు. అక్కడ దాదాపు రూ. లక్ష వరకూ ఎత్తుకెళ్లాడు. తర్వాత నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నుంచి ఎమ్‌రాల్డ్ భవనంలోకి వెళ్లి అక్కడి నుంచి ప్రముఖ డ్రస్ సర్కిల్ మాల్‌లోకి చొరబడ్డారు. పెయింటర్లు వాడే తాడు సాయంతో డ్రస్ సర్కిల్‌లో డబ్బు దాచే లాకర్‌ను తీసుకొని తాడు సాయంతో దిగి వెళ్లిపోయాడు. ఎంతో అనుభవం ఉండే వ్యక్తులు కూడా ఈ తరహాలో దొంగతనం చేయలేరనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అన్ని షాపుల్లోనూ భవనాలపై నుంచి లోపలికి చొరబడ్డాడు. ముఖం కనిపించకుండా జోకర్ మాస్క్ ధరించాడు. ఉదయాన్నే గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. డ్రస్ సర్కిల్ రూ.6.50 లక్షలు, పీఎస్‌ఆర్ వస్త్ర దుకాణంలో రూ. 80 వేలకు పైగా నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఘటన వన్‌టౌన్ పోలీసులు బయటకు పొక్కకుండా గుట్టుగా విచారిస్తున్నారు.


