మద్యం మత్తు..జీవితాలు చిత్తు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తు..జీవితాలు చిత్తు

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

కట్టుకున్న భార్యనే కడతేర్చిన తాగుబోతు

ఘటనను చూసి భీతిల్లిన పిల్లలు

మరోచోట తూలిపడి యువకుడి మృతి

శెట్టూరు/ధర్మవరం అర్బన్‌: ఊరూరా ఏరులై పారుతున్న మద్యం ఎందరో జీవితాలను ఛిద్రం చేస్తోంది. గడప పక్కనే దొరుకుతున్న మద్యానికి బానిస అవుతున్న పలువురు సంపాదనంతా తగలేస్తూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఓ వ్యక్తి మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. మరోచోట తప్పతాగి కిందపడిన యువకుడు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఈ రెండు ఘటనలు సర్కారు మద్యం చేస్తున్న చేటుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తప్పతాగి..రాడ్డుతో మోది

నిండు నూరేళ్లూ తోడుగా ఉండాల్సిన భర్తే భార్యను కడతేర్చిన ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మంగంపల్లిలో చోటు చేసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి పిల్లలు భీతిల్లగా.. ఈ దుర్ఘటనతో గ్రామస్తులు నివ్వెరపోయారు. పోలీసులు తెలిపిన మేరకు ... కురుబ మమత (38), తిప్పేస్వామి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. తిప్పేస్వామి మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడు. కుటుంబ పోషణను గాలికొదిలేశాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఫుల్లుగా మద్యం సేవించాడు. ఇంటికొచ్చిన తర్వాత మద్యానికి మళ్లీ డబ్బు కావాలని భార్యతో గొడవ పడ్డాడు. గొడవ తర్వాత ఆమె వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా తిప్పేస్వామి ఇనుప రాడ్డు తీసుకుని తలపై బలంగా మోదాడు. నొప్పి భరించలేక గట్టిగా అరిచింది. ఇంట్లో నిద్రిస్తున్న కుమార్తె ఐశ్వర్య (తొమ్మిదో తరగతి), ఇంటి బయట ఉన్న కుమారుడు అభి (ఇంటర్‌) పరుగున వచ్చి చూశారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి భీతిల్లిపోయి గట్టిగా కేకలు వేశారు. తిప్పేస్వామి పరారయ్యాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సుమన్‌ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

పడిపోయిన చోటే ప్రాణాలు పోయాయి..

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో ఆదివారం మద్యం మత్తులో కిందపడి జింక శ్రవణ్‌కుమార్‌(32) ప్రాణాలు కోల్పోయాడు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన జింక శ్రవణ్‌కుమార్‌ అవివాహితుడు. తాగుడుకు బానిసయ్యాడు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయేవాడు. ఆదివారం ఉదయం ఎర్రగుంట సర్కిల్లో మద్యం ఎక్కువగా సేవించి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మద్యం మత్తులో కింద పడి మృతిచెందిన శ్రవణ్‌కుమార్‌

రక్తపు మడుగులో పడి ఉన్న కురుబ మమత మృతదేహం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement