మాన్యం.. స్వాహాకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

మాన్యం.. స్వాహాకు సన్నద్ధం

Jun 28 2026 7:36 AM | Updated on Jun 28 2026 7:36 AM

ఎన్‌పీకుంట: మండల పరిధిలోని బలిజపల్లి పంచాయతీ సారగుండ్లపల్లి సమీపంలో బోడికొండ్రాయుని ఆలయం ఉంది. 200 ఏళ్ల చరిత్ర గల ఆలయంలో వెంకటరమణస్వామి పూజలు అందుకునేవాడు. ఆలయానికి 70.07 ఎకరాల మాన్యం భూములుండగా.. అందులో 20 ఎకరాల్లో చింతచెట్లను నాటించారు. మరో మూడు ఎకరాలు పాపాగ్ని నది మునకలో పోయింది. ఇంకో మూడు ఎకరాలు రోడ్డు నిర్మాణానికి సేకరించారు. మిగిలిన 44.07 ఎకరాల భూమిని వేలంపాట ద్వారా రైతులకు కౌలుకు ఇచ్చేవారు. ఈ ఆలయానికి గతంలో అల్లుగుంటి చౌరెడ్డి ధర్మకర్తగా ఉండే వారు. అప్పట్లో రైతులు ఐదెకరాలకు రూ.1,200 చొప్పున కౌలు చెల్లించడంతో పాటు పండిన పంటలో సగం ధర్మకర్తకు ఇచ్చేవారు. చౌరెడ్డి తర్వాత వారి కుమారులు ఎ.సిద్దారెడ్డి, రామకృష్ణారెడ్డి ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. రామకృష్ణారెడ్డి ధర్మకర్తగా ఉన్న సమయంలో ఎన్నో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణంతో పాటు పాపాగ్ని మునకలో వెళ్లిన బోడికొండ్రాయుని ఆలయ మాన్య భూములకు ఆయా శాఖల తరఫున పరిహారం అందగా..ఆలయ ధర్మకర్త రామకృష్ణారెడ్డి లెక్కలు చెప్పడం లేదని, అంతేకాకుండా ఆలయ అభివృద్ధి పేరుతో సేకరించిన విరాళాలు, చందాల సొమ్ము కూడా తినేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన రైతులు..

బోడికొండ్రాయుని ఆలయ మాన్యం భూములు పరాధీనమవుతున్న నేపథ్యంలో గతంలో పలువురు గ్రామస్తులు ఆలయం అభివృద్ధికి నోచుకోనివైనం, నిధులు స్వాహా పర్వంపై మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కమిషన్‌ నోటీస్‌తో స్పందించిన దేవదాయశాఖ ఆలయానికి కమిటీ అంటూ ఏమీ లేదని, ఓ అధికారిని నియమించి మాన్యం భూములను కౌలుకు ఇస్తామని అప్పట్లో కమిషన్‌కు తెలిపింది. కానీ గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై నోరు మెదపలేదు. ఆ తర్వాత తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో మాన్యం భూముల్లో ఎవరూ పంటలు పండించలేదు.

వేలంపాట ద్వారా కౌలుకు...

2020 సంవత్సరంలో దేవుని మాన్యంలోని పది ఎకరాల్లో ఉపాధిహామీ పథకం కింద చెట్లు పెంచడం కోసం అధికారులు చర్యలు చేపట్టగా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమిని రైతులకు కౌలుకు ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులు అదే ఏడాది మాన్యం భూములను వేలంపాట ద్వారా రైతులకు కౌలుకు ఇచ్చారు. ఆ తర్వాత 2022లోనూ మరోసారి వేలంపాట ద్వారా మూడేళ్ల కాలానికి ఒక్కో రైతు రూ.3,450 చెల్లించే విధంగా 10 మంది రైతులకు భూములను కౌలుకు ఇచ్చారు. ఇందులో దోస, కర్బూజ, కంది, ఉలవ, వేరుశనగ పంటలు సాగు చేశారు.

40 ఎకరాలు అర్చకులకు వెళ్లిందని సందేశం

మూడేళ్ల కౌలు గడువు 2025తో తీరిపోయినా... అధికారులు వేలం పాట నిర్వహించలేదు. దీంతో రైతులు మాన్యం భూములను కౌలుకు ఇచ్చేందుకు వేలంపాట నిర్వహించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. దానికి జవాబుగా దేవస్థానానికి సంబంధించిన 40 ఎకరాల భూమి అర్చకులకు వెళ్లిందని, ప్రస్తుతం నాలుగు ఎకరాలు మాత్రమే మిగిలిందని మొబైళ్లకు అధికారులు సందేశం పంపినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం శిథిలమై పాతికేళ్లవుతోందని, అప్పటి నుంచి ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరగడం లేదంటున్నారు. ఇప్పుడు అర్చకులు ఎక్కడి నుంచి వచ్చారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అండతో గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఎండోమెంట్‌ అధికారి ఈశ్వర్‌రెడ్డితో లాలూచి పడి భూమిని కబ్జాచేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి మాన్యం భూమిని కాపాడి రైతులకు కౌలుకు ఇవ్వాలని కోరుతున్నారు.

ఆక్రమణల్లో ఆరితేరిన ‘పచ్చ’ నేతలు...

దేవుడికే శఠగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. బోడికొండ్రాయుని ఆలయ మాన్యాన్ని సొంతం చేసుకునేందుకు అధికారాన్ని ఉపయోగించారు. పాతికేళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఆలయానికి అర్చకులను తెరపైకి తెచ్చారు. 44 ఎకరాల మాన్యం భూమిలో 40 ఎకరాలకు ఎసరు పెట్టారు. దీంతో ఇన్నాళ్లు ఆలయ భూములను కౌలుకు తీసుకుని బతుకుతున్న రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు.

బోడికొండ్రాయుని ఆలయ భూములపై కన్ను

అధికార అండతో 40 ఎకరాల కబ్జాకు యత్నం

మాన్యం భూములు కాపాడాలని

కౌలు రైతుల వేడుకోలు

వేలంపాట నిర్వహించాలి

ఆందోళన అవసరం లేదు

బోడికొండ్రాయుని మాన్యం భూమిని మా తాతల కాలం నుంచి కౌలుకు చేసుకుంటున్నాం. గతంలో వేలంపాట ద్వారా భూమి పొంది వేరుశనగపంట సాగు చేశా. కౌలు కాలం తీరిపోయినా అధికారులు వేలంపాట నిర్వహించలేదు. ఇప్పుడు మాన్యం భూమి నాలుగు ఎకరాలే ఉందని సెల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. అధికారులు చొరవచూపి భూమిని కౌలుకు ఇవ్వాలి.

– బి.కదిరప్ప, కౌలు రైతు, సారగుండ్లపల్లి

అర్చకులకు వెళ్లిందని చెబుతున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో దేవుని మాన్యం కిందే ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్యను దేవదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నివేదిక తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మమ్మ, తహసీల్దార్‌, ఎన్‌పీ కుంట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement