ప్రశాంతి నిలయం: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వారు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమై రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.... గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు 30 శాతం, మరణాలు 32 శాతం తగ్గాయన్నారు. హరిపురం జంక్షన్, పుట్టపర్తి క్రాస్, దామాజిపల్లి, దుద్దెబండ క్రాస్ సహా జిల్లాలో 26 ప్రమాద ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బత్తలపల్లిలో ఆర్డీటీ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం, తాడిపత్రి రోడ్డు తదితర చోట్ల స్పీడ్ బ్రేకర్లు , హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. లింక్‌రోడ్లకు అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు వేయాలన్నారు. కోరేవాండ్లపల్లి, గోరంట్ల, రెడ్డి చెరువు కట్ట ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తులు చేయించాలన్నారు. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన విగ్రహాలను పరిశీలించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


