క్లుప్తంగా
కారు డ్రైవింగ్, సీసీటీవీ
ఇన్‌స్టాలేషన్‌పై ఉచిత శిక్షణ
పుట్టపర్తి టౌన్: కెనరా బ్యాంక్ రీసెట్ ఐ వారి సౌజన్యంతో కారు డ్రైవింగ్, సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్‌పై 14 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులకు పుట్టపర్తి సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద కెనరాబ్యాంకు రీసెట్‌ఐ సంస్థ కార్యాలయంలో జూలై 21 తేది నుంచి శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9705091727, 9391486269లో సంప్రదించాలన్నారు.
పాత కక్షలు...
కత్తులతో దాడి
కదిరి టౌన్: పాత కక్షలు మనసులో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్న ఘటన కదిరి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన మేరకు..కుటాగుళ్ల రైల్వేగేట్ సమీపంలోని భవాని హోటల్ వద్ద పని చేస్తున్న రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన గాలివీడు నవీన్‌కుమార్‌పై అదేవీధికి చెందిన గాలివీడు రాజశేఖర్, అతని బంధువు వంశీ గొడవపడి కత్తితో దాడి చేశాడు. దాడిలో గాయపడిన నవీన్‌కుమార్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. బాధితురాలు ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు రాజశేఖర్, వంశీపై కేసు నమోదు చేశారు.
పరిషత్ కార్యాలయాల్లో ‘సర్’ హెల్ప్ డెస్క్‌లు
అనంతపురం న్యూటౌన్: ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై జిల్లా పరిషత్ సహా అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆమె మాట్లాడారు. సర్‌పై సందేహాలను హెల్ప్ డెస్క్‌ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చునన్నారు.
బస్సులో 12 తులాల బంగారు నగలు చోరీ
గోరంట్ల: మండల కేంద్రంలో ఆర్‌టీసీ బస్సులో శింగిరెడ్డిపల్లికి చెందిన ప్రయాణికురాలు బ్యాగ్‌లో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు పోగొట్టుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..శింగిరెడ్డిపల్లికి చెందిన సుస్మిత అనే ప్రయాణికురాలు హిందూపురంలోని బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లేందుకు గోరంట్ల బస్టాండ్‌లో ఆర్‌టీసీ బస్సు ఎక్కింది. బస్సు కదిలిన తర్వాత బ్యాగ్ పరిశీలించగా బంగారం కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే బస్సు దిగి గోరంట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గోరంట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పుట్టపర్తి అర్బన్: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే పల్స్ పోలియో ఆదివారం జరగనుంది. ఈనెల 28న పల్స్ పోలియో కేంద్రంలో పోలియో చుక్కలు వేయనున్నారు. ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం 29, 30 తేదీల్లో గృహ సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ క్రమంలో శనివారమే వ్యాక్సిన్ క్యారియర్ వాహనాలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు పంపారు. ఆయా వాహనాలను ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ చెన్నారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులు 1,71,315 మంది ఉన్నారని, వీరి కోసం 1,011 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. చుక్కల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 210 మంది సూపర్ వైజర్లను, పోలియో చుక్కలు వేసేందుకు 4,926 మందిని నియమించినట్లు ఆయన వెల్లడించారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
జిల్లాలో 1,71,315 మందికి
చుక్కల మందు వేసేలా ప్రణాళిక


