ధర్మవరం అర్బన్: పట్టణంలోని సిద్దయ్యగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.50.85 లక్షలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల కింద ప్రభుత్వం మంజూరు చేసిందని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధుల కింద నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు.
బ్రిడ్జి పనులను
త్వరగా పూర్తి చేయాలి
ప్రశాంతినిలయం: జిల్లాలో వివిధ రైల్వే బ్రిడ్జిలు, వంతెనలు, అండర్ బ్రిడ్జిల పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు ప్రతిపాదిత దశలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ అండర్ బ్రిడ్జిలు పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజల సౌకర్యార్థం, భద్రత దృష్ట్య పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.
25 వేల హెక్టార్లకు
డ్రిప్ అందించడమే లక్ష్యం
బత్తలపల్లి: శ్రీసత్యసాయి జిల్లాలో 2026–27 సంవత్సరానికి 25 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందజేయడమే లక్ష్యమని ఏపీఎంఐపీ పీడీ ఆర్.దేవానంద్ తెలిపారు. శనివారం బత్తలపల్లి మండలంలో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాలో రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, అందుకోసం డ్రిప్ విధానాన్ని అనుసరించాలన్నారు. రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో 14 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందించామని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 25 వేల హెక్టార్లకు అందించడమే లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన రైతులకు పది ఎకరాల్లోపు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు.ఎంఐఏఓ శివశంకర్, పలు డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


