కదిరి: ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్’)పై కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ‘అన్నీ సందేహాలే ‘సర్’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఓటర్ల సందేహాలపై పత్రికల్లో వచ్చే కథనాలపై ఆయా డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు పత్రికా ముఖంగా నివృత్తి చేయాలని ఆదేశించారు. దీంతో కదిరి ఆర్డీఓ కళావతి శనివారం ఓ పత్రికా ప్రకటన ద్వారా పలు విషయాలు తెలియజేశారు.
● బీఎల్‌ఓలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు తగిన శిక్షణ ఇచ్చామని, ఓటర్లకు ఎలాంటి సందేహాలు తలెత్తినా బీఎల్‌ఓలు దగ్గరుండి తగిన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు.
● కొత్త ఓటరు నమోదుతో పాటు సవరణకు సంబంధించిన ఫారాలు బీఎల్‌ఓల దగ్గర అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన ఓటర్లు అడిగి తీసుకోవచ్చన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలో పలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించామని, బీఎల్‌ఓలు లేదా బీఎల్‌ఏల సహకారం కూడా తీసుకోవచ్చన్నారు.
● 2002 ఓటర్ల జాబితాలో పేరు లేని వివాహిత మహిళలు తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు అందులో పొందుపరిస్తే సరిపోతుందన్నారు. ‘సర్’పై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఎంట్రీలు మాత్రమే తొలగిస్తామన్నారు.
ప్రతి ఫారాన్ని తహసీల్దార్ ధ్రువీకరించాలి
ప్రశాంతి నిలయం: ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్)లో అందే ఎన్యూమరేషన్ ఫారాన్ని తహసీల్దార్లు ధ్రువీకరించి డిజిటలైజేషన్ చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ కొండయ్యతో కలిసి కలెక్టరేట్ నుంచి ‘సర్’ కార్యక్రమంపై ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడారు. జిల్లాలో 1,576 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో 14,23,839 మంది ఉన్నారన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,06,751 మంది కాగా, మహిళా ఓటర్లు 7,17,023 మంది ఉన్నారన్నారు. ఇక థర్డ్ జండర్ ఓటర్లు 65 మంది ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికీ ఓ బీఎల్‌ఓను, వారిపై పర్యవేక్షణకు 156 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 93.07 శాతం పూర్తయ్యింన్నారు. డిజిటలైజేషన్లో 19.88 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. జూలై 14వ తేదీలోపు ప్రక్రియ పూర్తి కావాలన్నారు.


