వృద్ధుడి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి అనుమానాస్పద మృతి

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

తాడిపత్రి రూరల్‌ : పట్టణ సమీపంలోని గన్నేవారిపల్లికాలనీకి చెందిన నారాయణరెడ్డి (70) అనుమానాస్పదంగా మృతి చెందాడు. శనివారం స్థానిక స్టేషన్‌లో అప్‌గ్రేడ్‌ ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి తెలిపిన మేరకు.. వైఎస్‌ఆర్‌ జిల్లా రైల్వే కొండాపురం మండలం ఏటూరుకు చెందిన నారాయణరెడ్డి రెండేళ్ల నుంచి గన్నేవారిపల్లి కాలనీలో నివాసం ఉంటున్న చిన్న భార్య కుమార్తె సుచిత్ర వద్ద ఉంటున్నాడు. చిన్న అల్లుడు అల్లం సత్యనారాయణ అనంతపురంలో బిర్యానీ సెంటర్‌ నడిపేవాడు. హోటల్‌లో నష్టాలొచ్చి ముదిగుబ్బలో కొంత పొలం కౌలుకు తీసుకున్నాడు. అప్పుడప్పుడు తాడిపత్రి సమీపంలోని ఇంటికొచ్చి వెళ్తుండేవాడు. ముదిగుబ్బలో వ్యవసాయ కూలీగా పరిచయమైన ఘని చిన్న అల్లుడితో పాటు ఉంటున్నాడు. తాడిపత్రికి చిన్న అల్లుడితో పాటు ఘనీ వచ్చాడు. మామ నారాయణరెడ్డితో ఘనికి గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం ఇంటికొచ్చిన నారాయణరెడ్డి మృతిచెందాడు. మృతుడు నారాయణరెడ్డి పెద్ద కుమారై సవిత ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

తలుపుల: మండలంలోని బి.కొత్తపల్లికి సమీపంలో పాత ఘాట్‌ రోడ్డులో కారు, ద్విచక్రవాహనం ఢీకొని మేడా భరత్‌ నరసింహ (25) శనివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కొత్తపల్లికి చెందిన ఓబయ్య కుమారుడు బెంగళూరులో బ్యాంకులో పనిచేస్తూ, బంధువుల ఇంట జరిగే పెళ్లి కోసం స్వగ్రామానికి వచ్చాడు. తన అమ్మమ్మగారి ఊరు మైదుకూరుకు వెళ్తుండగా, గ్రామ సమీపంలో కారు ఢీకొనడంతో మృతి చెందాడు. తండ్రి ఓబయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement