గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–అశోకపురం మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. కాచిగూడ జంక్షన్ నుంచి ఆగస్టు 25న, అశోకపురం నుంచి 26 నుంచి ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. కాచిగూడ నుంచి రోజూ ఈ రైలు (12785) సాయంత్రం 7.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10 గంటలకు అశోకపురం జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు (12786) అశోకపురం జంక్షన్‌లో మధ్యాహ్నం 2.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ జంక్షన్‌కు చేరుతుందన్నారు. ఈ రైలు జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం. ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపురం, యలహంక, బెంగళూరు ఈస్ట్, కేఎస్‌ఆర్ బెంగళూరు, కనిగేరి, రామనగరం, మండ్య, మైసూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లు వివరించారు.
సరళకు జాతీయ పురస్కారం
ధర్మవరం అర్బన్: పట్టణానికి చెందిన జానపద గాయని సోమిశెట్టి సరళ జాతీయ పురస్కారం అందుకున్నారు. సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోసిటరీ (డీడీఆర్) ప్రాజెక్టు ముగింపు వేడుకలు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమంలో భాగంగా జిల్లాకు సంబంధించిన స్వాతంత్య్ర పోరాటం, స్థానిక చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై అత్యధిక పరిశోధనాత్మక కథనాలను సమర్పించిన సోమిశెట్టి సరళను కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీసీఆర్‌టీ చైర్మన్ వినోద్‌కుమార్ మెమొంటో, జాతీయ పురస్కారం అందించి సన్మానించారు.


