సాక్షి, పుట్టపర్తి/ హిందూపురం టౌన్: హిందూపురంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలోనే అతి పెద్దది. జిల్లా నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. రోజుకు సగటున 800 మంది ఓపీ విభాగంలో చికిత్స పొందుతుంటారు.100 పడకలు ఇన్‌పేషెంట్ల కోసం అందుబాటులో ఉంచారు. డయాలసిస్, ఎమర్జెన్సీ, టీబీ సెక్షన్, ఆర్థో, ఆప్తమాలజీ, గైనకాలజీ విభాగాలన్నీ రోగులతో రద్దీగా ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రమాదాలు, ఆత్మహత్య కేసులన్నీ హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికే వస్తాయి. ప్రమాదాలు, ఆత్మహత్యల కేసుల్లో ఆస్పత్రికి వచ్చిన వారిలో నెలకు సగటున 20 మంది మరణిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల్లో 90 శాతం మంది పేదలే. అయితే ఆస్పత్రిలో చనిపోతే శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ‘మహా ప్రస్థానం’ వాహనం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేటు వాహనాల డ్రైవర్లు దూరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తుంటారు.
పేరుకే పెద్దాసుపత్రి
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. అంతకుముందు మహాప్రస్థానం వాహనం ఉండేది. కొన్నాళ్లకు మరమ్మతులకు గురి కావడంతో మూలన పడేశారు. పట్టించుకునే దిక్కు లేకపోవడంతో ‘మహాప్రస్థానం’ వాహనం కరువైంది. జిల్లా ఆస్పత్రిలో ‘మహాప్రస్థానం’ వాహనం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పవచ్చు. ఆస్పత్రి కమిటీ సభ్యులు పట్టించుకోకపోవడం మరో కారణం. గతంలో మహాప్రస్థానం వాహనం మంజూరైనప్పటికీ నిర్వహణకు సాధ్యం కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపినప్పటికీ చంద్ర బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి సారించలేదు. దాతలు ఇచ్చిన మహాప్రస్థానం వాహనం మూలన పడేశారు.
ఎమ్మెల్యే ప్రగల్బాలు మాటలకే పరిమితం..
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలో కనీసం మహాప్రస్థానం వాహనాన్ని ఏర్పాటు చేయించలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఆసుపత్రిలో మృతి చెందిన వారిని తరలించాలంటే వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధలను ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికైనా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.
హిందూపురం ఆస్పత్రిలో
నెలలో 20కు పైగా మరణాలు
మృతదేహాలు తరలించడానికి
ప్రైవేటు వాహనాలే దిక్కు
దాతలు ఇచ్చిన ‘మహా ప్రస్థానం’ మూలన పడ్డ వైనం
ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టి
సారించాలని కోరుతున్న ప్రజానీకం
రొద్దం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతన్ని అంబులెన్స్ ద్వారా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అరగంట పాటు పలు పరీక్షలు చేసి ఆ తర్వాత మరణించినట్లు వెల్లడించారు. అయితే కటిక పేదరికంలో ఉండే ఆ కుటుంబం మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడింది. తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాల్సి వచ్చింది.
పరిగి మండలానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని హిందూపురం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం అనంతరం మరుసటి రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బాధిత కుటుంబం తెలిసిన వారితో అప్పు తీసుకుని ప్రైవేటు వాహనంలో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది.


