రోడ్డు ప్రమాదంలో మెకానిక్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మెకానిక్‌ దుర్మరణం

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

హిందూపురం: రోడ్డు ప్రమాదంలో ఓ మెకానిక్‌ దుర్మరణం పాలైన ఘటన స్థానిక పోలీస్‌ పెట్రోల్‌ బంకు సమీపంలోని మలుపు వద్ద జరిగింది. వివరాలు.. హిందూపురంలోని రహమత్‌పూర్‌కు చెందిన మెకానిక్‌ రిజ్వాన్‌ బాషా (32) గురువారం రాత్రి బైపాస్‌ రోడ్డులోని పోలీస్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ఆటో ఢీకొంది. తలకు బలమైన గాయాలైన అతన్ని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సల కోసం అనంతపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడు రిజ్వాన్‌బాషకు భార్యతో పాటు రెండెళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అదరహో భరత్‌

అనంతపురం కల్చరల్‌: ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుని జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసాతి భరత్‌ మరోసారి అంతర్జాతీయ వేదికపై జిల్లా ఖ్యాతిని ఘనంగా చాటారు. అజర్‌బైజాన్‌ దేశ రాజధాని బాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 9వ సీఐసీఏ (కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇంటరాక్షన్‌, కాన్ఫిడెన్సు బిల్డింగ్‌ మెజర్స్‌ ఇన్‌ ఆసియా) కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. దేశం తరఫున ముగ్గురు ఎంపిక కాగా అందులో భరత్‌ ఒకరు కావడం గమనార్హం. యువత సాధికారత, నాయకత్వ వికాసం, జాతి నిర్మాణంలో విశేష కృషి చేస్తున్నందుకు భరత్‌ను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. భరత్‌ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, తన వంతుగా దేశ ఔన్నత్యాన్ని చాటడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. నూతన ఆవిష్కరణలు, పట్టణ రవాణా, పర్యావరణ పరిరక్షణ, ప్రజాభద్రత, స్మార్ట్‌ సిటీ అభివృద్ధి తదితర అంశాలపై సీఐసీఏలో చర్చిస్తారన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖామాత్యులు మన్సుఖ్‌ మాండవీయ సహకారమందిస్తు న్నారని వెల్లడించారు. భరత్‌కు ‘మై భారత్‌ ప్రోగ్రాం’ అధికారి గోవర్దన శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జయమారుతి, సుంకర రమేష్‌ అభినందనలు తెలిపారు.

లారీ దగ్ధం..

డ్రైవర్‌ సజీవ దహనం

ఉరవకొండ: లారీ దగ్ధమై అందులోని డ్రైవర్‌ సజీవ దహనమైన ఘటన అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారి కొట్టాలపల్లి వద్ద జరిగింది. బళ్లారి నుంచి అనంతపురం మీదుగా నెల్లూరుకు గ్రానెట్‌ లోడుతో శుక్రవారం తెల్లవారుజామున లారీ బయలుదేరింది. కొట్టాలపల్లి సమీపంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మండలం కనుమపల్లికు చెందిన డ్రైవర్‌ ఓబుల్‌రెడ్డి మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యాడు. క్లీనర్‌ పుల్లయ్య లారీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డ్రైవర్‌ను కాపాడేందుకు క్లీనర్‌ రోడ్డుపై కేకలు వేస్తూ ఆ మార్గంలో వెళుతున్న వాహనదారుల సాయం కోసం ప్రయత్నించినా ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement