17 మంది బీఎల్‌ఓలకు షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

17 మంది బీఎల్‌ఓలకు షోకాజ్‌ నోటీసులు

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

అనంతపురం క్రైం: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఓటర్ల నమోదు ఫారాల డిజిటైజేషన్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది బూత్‌ లెవల్‌ అధికారుల(బీఎల్‌ఓల)కు మున్సిపల్‌ కమిషనర్‌ శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో బి. మల్లన్న, ఎం. నాగాంజలి, కె. ఫణి కృష్ణ, ఎస్‌. రేష్మా, ఎ. హేమసుందరి, జి. విద్య, అరికట్ల ఉదయశ్రీ , బుల్లి అనిల్‌ కుమార్‌, బి. గణేష్‌ రెడ్డి, యల్లమ్మ రాగే, జి.టి. శ్రావణి, సోంపల్లి చార్విత్‌, ఎన్‌. నవీన్‌ కుమార్‌, జి. హరిత, సి.కె. నరేష్‌, ఎం. చైతన్య, గురు కుమారి ఉన్నారు.

పీఆర్‌ ఇంజినీర్లకు పదోన్నతులు

అనంతపురం న్యూటౌన్‌: పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న 18 మందికి పదోన్నతి లభించింది. ఏఈలుగా పని చేస్తున్న కే.లక్ష్మి నారాయణ, బి.గోపాల్‌ నాయక్‌, బీబీఎన్‌ ప్రసాద్‌, పి.పాండురంగా రెడ్డి, ఏ.లక్ష్మినారాయణ, వి.రామాంజనేయులు, ఎం.వెంకటేసులు, ఎం.ఓబుళ్‌దాస్‌, సి.ఓబుళ్‌దాస్‌, కే.వరప్రసాద్‌, సి.విశ్వనాథరెడ్డి, అరుణ్‌కుమార్‌, సీఆర్‌ మధులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. డీఈలుగా ఉన్న వై.శ్రీరాములు, నవీన్‌, చంద్రశేఖర్‌, రవికుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లుగా పదోన్నతులు పొందారు. జిల్లాలో ఈఈగా పనిచేస్తున్న జి. ప్రభాకర్‌ రెడ్డిని కర్నూలు జిల్లా పంచాయతీరాజ్‌ సూపరిండెంటెంట్‌ (ఎస్‌ఈ)గా పదోన్నతిపై బదిలీ చేశారు. ఈ మేరకు వారంతా అనంతపురం పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బాలూ నాయక్‌ నుంచి శుక్రవారం ఉత్తర్వులు అందుకున్నారు.

వివాహిత ఆత్మహత్య

ఉరవకొండ: మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన బాణాపురం కీర్తి (20) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని కరికూటిపల్లికి చెందిన అమ్రేష్‌, శాంతమ్మ దంపతుల కుమార్తె కీర్తికి ఆమిద్యాల గ్రామానికి చెందిన అనిల్‌తో 8 నెలల క్రితం వివాహమైంది. ఇటీవల గర్భం దాల్చిన కీర్తికి పిండాభివృద్ధి సరిగా జరగకపోవడంతో అబార్షన్‌ అయింది. అప్పటి నుంచి కడుపు నొప్పితో కీర్తి బాధపడుతుండేది. గురువారం రాత్రి నొప్పి తీవ్రం కావడంతో ఉరి వేసుకుంది. పొలం నుంచి వచ్చిన భర్త అనిల్‌ బంధువుల సాయంతో కీర్తిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తన్నుకున్న ‘తమ్ముళ్లు’

శింగనమల: ఇసుకను అక్రమంగా తరలించే క్రమంలో ‘తెలుగు’ తమ్ముళ్లు తన్నుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలోని ఉల్లికల్లు సమీపంలోని పెన్నానది నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఒక్కొక్కరు రూ.లక్ష వరకు జేబుల్లోకి వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెరవలికి చెందిన ఓ టీడీపీ మండల నాయకుడు కూడా శుక్రవారం ఉల్లికల్లు పెన్నానది వద్దకు అనుచరులతో కలిసి వెళ్లాడు. ఇకపై తాను కూడా ఇసుక తరలిస్తానని చెప్పాడు. అయితే, ఈ విషయంపై ముగ్గురి నడుమ గొడవ జరిగింది. స్థానికులు కలగజేసుకోవడంతో అంతా సద్దుమణిగింది. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతోనే ఇంత దాకా వచ్చిందని, ఇప్పటికై నా ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement