చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల పాలనలో భూకబ్జాలు మితిమీరిపోయాయని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ముఖ్య నేత వేణురెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం హిందూపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వేణురెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయానికి కప్పం కడితే చాలు క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు ఏమి చేసుకున్నా తమకు పట్లదన్నట్లుగా పీఏలు వ్యవహరిస్తున్నారని, ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిలమత్తూరు మండలంలోని చాగలేరు పంచాయతీ మోతుకపల్లిలో 23 ఎకరాల్లో అన్ రిజిస్టర్డ్ వీలునామాతో టీడీపీ నేతలు 10 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో కబ్జాలకు అడ్డూ అదుపూ లేకుండా ఉందన్నారు. టీడీపీ నేతలకు తహసీల్దార్ వెంకటేష్, సబ్ రిజిస్ట్రార్‌లు సహకరించారని ఆరోపించారు. కొట్నూరు పొలంలో చెరువు పక్కన మాజీ కౌన్సిలర్ మల్లికార్జున 2 ఎకరాల భూమిని కబ్జా చేసి కంచె వేసుకున్నాడని, అదే విధంగా తిరుమలనాయుడు అనే వ్యక్తి 15 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశాడని విమర్శించారు. కబ్జాలన్నీ ఎమ్మెల్యే పీఏల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. హిందూపురంలో గుజిరీ వ్యాపారం చేసుకుంటున్న వారి నుంచి కూడా కప్పం కట్టించుకునేందుకు జనసేన, బీజేపీ, టీడీపీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు సిద్ధమయ్యారన్నారు. కప్పం కట్టలేదంటే షాపులను సీజ్ చేయిస్తామని బెదిరించడం, చివరకు పోలీసులను రంగంలోకి దింపి స్టేషన్‌కు వాహనాలను తరలించడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల కడుపు కొట్టే ఇలాంటి వారిని ఏమనాలో కూడా తెలియడం లేదని దుయ్యబట్టారు. ఇది ఎంత కాలమో సాగదని, తగిన రీతిలో బుద్ది చెబుతామని ఆయన హెచ్చరించారు.
గుజరీ వ్యాపారులనూ కూటమి నేతలు దోచుకుతింటున్నారు
వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి ధ్వజం


