హిందూపురం: దళితులకు అన్యాయం చేస్తే సహించబోమని ఏఐసీఎఫ్ ప్రతినిధులు హెచ్చరించారు. పట్టణంలోని సీఅండ్‌ఐజీ చర్చ్ మిషన్ కాంపౌండ్‌లో శుక్రవారం ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏఐసీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు పాస్టర్లు మాట్లాడుతూ దళితులకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను కాలరాశారన్నారు. ఎస్సీలు ఇతర మతాలను స్వేకరిస్తే వారికి జన్మతః వచ్చిన ఎస్సీ హోదా కోల్పోతారంటూ అన్యాయంగా ఉత్తర్వులు ఇచ్చారన్నారు. 1956లో దళిత సిక్కులకు, 1990లో దళిత బౌద్ధులకు మినహాయింపు ఇచ్చారని 75 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా దళితులకు మత స్వేచ్ఛ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ, బీసీ, ఎస్టీలకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే పెట్టారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలన్నారు. రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ కల్పించిందని, ఇది దళితులకు వర్తించదా అని ప్రశ్నించారు. మతం మారితే కులం మారదని, దళితులు మతం మారినా ఇంకా వివక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణన్ కమిషన్ రిపోర్టు దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తే మాత్రం సహించేది లేదని, దేశవ్యాప్తంగా మహా ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు, పాస్టర్ డేవిడ్ రవికిరణ్, హిందూపురం పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.డేవిడ్, సెక్రటరీ జయరాజ్, యునైటెడ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, సెక్రటరీ పాల్ తిమోతి, చర్చ్ బోర్డ్ సభ్యులు సాల్మన్ రాజ్, దేవరాజ్, ఆంజనేయులు ఆడిటర్లు జాన్ ప్రసాద్, డేవిడ్, రెవరెండ్ దేవరాజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


