అనంతపురం సెంట్రల్: చంద్రబాబు పాలనలో ఖాకీపై ఖద్దరు స్వారీ చేస్తోంది. కానిస్టేబుల్ దగ్గర నుంచి అన్నీ రాజకీయ పోస్టింగ్‌లు కావడంతో విలువలు దిగజారిపోతున్నాయి. మారుమూల పోలీసుస్టేషన్‌కు అయినా ఒక కానిస్టేబుల్‌ను పంపాలంటే సదరు ఎమ్మెల్యే అనుమతి ఉండాలి. ఇక ఎస్‌ఐలు, సీఐలైతే చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యే అనుమతి ఇస్తేనే పోస్టింగ్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులకు పోలీసు లంటే లెక్కలేకుండా పోతోంది. తమ దయాదాక్షిణ్యాలపై పనిచేసే వారుగా భావిస్తున్న ‘పచ్చ’ నేతలు ఖాకీలపై రెచ్చిపోతున్నారు.
తాడిపత్రిలో మరీ దయనీయం..
తాడిపత్రి సబ్ డివిజన్‌లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఏఎస్పీగా ఉన్నా లా అండ్ ఆర్డర్ మాత్రం పోలీసుల ఆధీనంలో లేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో నడుస్తోంది. రెండేళ్లుగా వైఎస్సార్‌సీపీ ఏ కార్యక్రమం చేపట్టినా అదే రోజు టీడీపీ కార్యక్రమానికి పిలుపునిస్తుండడం.. శాంతిభద్రతల సాకుతో పోలీసులు వైఎస్సార్‌సీపీని మాత్రమే నిలువరిస్తుండడం రివాజుగా మారింది. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు పాలనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ తలపెట్టిన ర్యాలీని కూడా తాడిపత్రిలో జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నెల 24న పట్టణంలో ఏఎస్పీతో పాటు పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ‘పచ్చ’ మూకలు దాడులు చేశాయి. దీన్నిబట్టి చూస్తే ఇక్కడి పోలీసులు తమను ఏమీ చేయలేరనే లెక్కలేనితనం టీడీపీ నేతల్లో కన్పిస్తోంది. తాడిపత్రిలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో ఏఎస్పీ రోహిత్‌తో పాటు ఎస్పీ జగదీష్ ఘోరంగా విఫలమయ్యారని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.
మరీ ఇంత మెతక వైఖరా..?
ఏ జిల్లాలోనైనా శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నా, పోలీసు శాఖ ప్రతిష్ట పెరగాలన్నా ఎస్పీల తీరుపై ఆధారపడి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడకుండా పనిచేసినప్పుడు పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. గతంలో స్టీఫెన్ రవీంద్ర లాంటి ఎస్పీ పనితీరును ఇప్పటికీ జిల్లావాసులు గుర్తు చేసుకుంటారంటే వారు ఎంత నిక్కచ్చిగా పనిచేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. పోలీసుల చెంపలు చెళ్లు మనిపిస్తున్నా.. కాలర్ పట్టుకొని నడిరోడ్లపై లాగుతున్నా చూసీచూడనట్లు పోతున్నారు. కనీసం ఎస్పీ సీరియస్ అన్న ప్రకటనలు కూడా విడుదల చేయకపోవడం చూసి మరీ ఇంత మెతక వైఖరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నా.. పోలీసు అధికారుల సంఘం కనీసం ఖండిస్తున్న పాపాన పోవడం లేదు. అధికారులతో సన్నిహితంగా మెలుగుతూ సంఘం ముసుగులో పది, పదిహేనేళ్లకు పైగా జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)ను అట్టిపెట్టుకొని ఉండటానికే పోలీసు అధికారుల సంఘ నాయకులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● ఈ నెల 23న ముదిగుబ్బ మండలంలోని గాండ్లవారిపల్లి పంచాయతీ పరిధిలోని బ్రహ్మదేవర మర్రిలో ఊరంతా చూస్తుండగానే మంత్రి సత్యకుమార్ అనుచరుడు చంద్రమోహన్ హెడ్ కానిస్టేబుల్ గణేష్ చెంప చెల్లుమనిపించాడు. చంద్రమోహన్‌పై ఫిర్యాదు రావడంతో విచారణ నిమిత్తం గ్రామానికి వెళ్లడమే హెడ్‌కానిస్టేబుల్ గణేష్ చేసిన తప్పయింది. ఈ క్రమంలో బాధిత హెడ్‌కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
● రాయదుర్గంలో ఈనెల 21న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనుచరుడు మారుతి రెచ్చిపోయాడు. కానిస్టేబుల్ రాజ్‌కుమార్ చొక్కా పట్టుకొని లం.. కొడకల్లారా అంటూ నానా బూతులు తిట్టాడు. కానిస్టేబుల్ చొక్కా చిరిగిపోయినా వదిలిపెట్టలేదు. దారికి అడ్డంగా పెట్టిన కారును పక్కకు పెట్టాలని సూచించడమే సదరు కానిస్టేబుల్ చేసిన నేరమైంది. పట్టపగలు అందరి కళ్లముందే ఒక పోలీసును అవమానపరచినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న పాపానపోలేదు. మారుతి వెనుక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఉండడమే ఇందుకు కారణమని తెలిసింది.
● తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల దయనీయ పరిస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోలీసులంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులకు ఇసుమంత కూడా లెక్కలేదు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డిపై దాడి జరిగిన సమయంలో పోలీసులున్నా నిలువరించలేకపోవడాన్ని చూసి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు చీదరించుకున్నారు. కానిస్టేబుళ్లను తోసుకుంటూ వెళ్లి మరీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’ మూక దాడులకు పాల్పడడం గమనార్హం.
నాలుగో సింహం నవ్వులపాలు
చంద్రబాబు ప్రభుత్వంలో
ఖాకీలకే రక్షణ కరువు
చొక్కాలు పట్టుకుంటున్నా,
చెంపలు చెళ్లుమనిపిస్తున్నా చర్యల్లేవ్
రెచ్చిపోతోంది అధికారపార్టీ నాయకులు కావడంతోనే మౌనం
చోద్యం చూస్తున్న పోలీసు బాస్‌ల తీరుపై సర్వత్రా విమర్శలు


