ప్రశాంతి నిలయం: త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ త్యాగాలను స్మరించికుంటూ మొహర్రం జరుపుకుంటామని, సమాజంలో కరుణ, త్యాగ నిరతిని మొహర్రం చాటి చెబుతుందన్నారు. జిల్లాలో ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పోలీసుపై దాడి చేసిన వ్యక్తికి బెయిలు
ముదిగుబ్బ: ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడంతో పాటు పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడైన బ్రహ్మదేవరమర్రి గ్రామానికి చెందిన నంద్యాల చంద్రమోహన్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ శివరాముడు తెలిపారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా... జడ్జి బెయిల్ మంజూరు చేశారన్నారు. గురువారం ఆయన ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. చంద్రమోహన్ తన గ్రామంలోని పంచాయతీ తాగునీటి బోరును రాళ్లతో ధ్వంసం చేయడంతో పాటు విద్యుత్ సరఫరా చేసే వైర్లను పీకివేశాడు. ఈ విషయమై గ్రామస్తులు ప్రశ్నించగా.. వారిని దుర్భాషలాడి మరోసారి అడ్డుకుంటే చంపేస్తానన్నారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారణ నిమిత్తం వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గణేష్‌కుమార్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఆ రోజే చంద్రమోహన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు... గురువారం అతను దొరిగిల్లు గ్రామం వద్ద ఉన్న మూడు రోడ్ల కూడలిలో ఉన్నట్లు సమాచారం అందడంతో పెద్దమనుషుల సమక్షంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో జడ్జి బెయిల్ ఇచ్చారని సీఐ తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా ఓ కేసు నమోదు అయినట్లు సీఐ వెల్లడించారు.
అన్నీ సందేహాలే ‘సర్’
కదిరి: ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్)లో భాగంగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలోని 1,576 మంది బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇస్తున్నారు. అయితే వాటిని పూర్తి చేసి గడువులోపు తిరిగి బీఎల్‌ఓల చేతికి అందజేయాలి. ఈ క్రమంలో చాలా మందికి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. వాటి గురించి అడిగితే బీఎల్‌ఓలు కూడా సమాధానం చెప్పకపోవడంతో ఎవరిని అడగాలో తెలియక ఓటర్లు తికమకపడుతున్నారు.
ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలు కొన్ని
● ఎన్యుమరేషన్ పత్రం నింపాలంటే 2002 ఓటర్ల జాబితా చూసి, అందులోని నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ నంబర్‌తో పాటు ఓటరు వరుస సంఖ్య వేయాల్సి ఉంటుంది. ఆ జాబితాను బీఎల్‌ఓలతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తకు ఇచ్చారు. కానీ ఓటర్లు మాత్రం వీటికోసం ఇబ్బంది పడుతున్నారు.
● 2002 ఓటర్ల జాబితాలో పేరు లేని వివాహిత మహిళలు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన వివరాలు ఎన్యూమరేషన్ పత్రంలో నింపాల్సి ఉంటుంది. అయితే 2002 నాటికే తమ తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఎవరి వివరాలు ఇవ్వాలన్న ప్రశ్నకు బీఎల్‌ఓలు కూడా సమాధానం చెప్పడం లేదు.
● ఓటరు నమోదు, సవరణకు 6, 7, 8 ఫాంలను బీఎల్‌ఓలను అడిగితే తమ వద్ద లేదనే చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
● ఎన్యూమరేషన్ పత్రం నింపేటప్పుడు తప్పులు దొర్లినా, కొట్టివేతలు ఉన్నా.. ఇంకో పత్రం ఇవ్వడం లేదని జనం వాపోతున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని ఓటర్లకు వచ్చే సందేహాల నివృత్తికి కృషి చేయాలంటున్నారు.


