ఓడీచెరువు/బత్తలపల్లి: వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితుల్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిలో సాగు చేయడం వల్ల మెరుగైన దిగుబడులు సాధ్యమవుతాయని రైతు సాధికార సంస్థ గౌరవ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ (విశ్రాంత ఐఏఎస్ ) పేర్కొన్నారు. గురువారం ఆయన రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నికల్ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ లక్ష్మానాయక్‌తో కలిసి బత్తలపల్లి, నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు మండలాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో చర్చించారు. బత్తలపల్లి మండలం గంటాపురంలో బోయపాటి పార్వతి తన పొలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలను పరిశీలించారు. అనంతరం ఓడీచెరువు మండలం ఇనగలూరు గ్రామంలో రైతులు వాసుదేవరెడ్డి, ఆనందరెడ్డి పీఎండీఎస్ పద్ధతిలో సాగుచేస్తున్న మామిడి మల్బరీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రభావం వ్యవసాయం, పశుపోషణపై ఉంటుందన్నారు. వాటిని ఎదుర్కొని సాగును లాభదాయకంగా చేసేందుకు రైతులంతా తక్కువ నీటితో పండే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్లు డాక్టర్ నరేంద్ర, డాక్టర్ నవీన్, దామోదర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నారాయణ నాయక్, ఏడీఏ లక్ష్మానాయక్, ఏఈఓ శ్రీనివాసులు, వీహెచ్‌ఏ ఓబులమ్మ, మాస్టర్ ట్రైనర్ హరికుమార్, సుకన్య తదితరులు పాల్గొన్నారు.


