రొద్దం: ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతుల్లోని వజ్రాయుధమని, అందుకే కొందరు కుట్రలతో ఓటు తొలగించి ప్రజలను నిరాయుధులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆరోపించారు. ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. గురువారం ఆమె మండలంలోని కలిపి, నల్లూరు, పెద్దమంతూరు, చెరుకూరు, చోళేమర్రి గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్)పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ‘సర్’పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికార పార్టీ నేతలు కుట్రలు చేసి వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేయవచ్చన్నారు. పార్టీ నియమించిన బీఎల్‌ఏలు తప్పనిసరిగా బీఎల్‌ఓలతో కలిసి ఇంటింటికీ తిరగాలన్నారు. ఒక్క ఓటు కోల్పోయినా తిరిగి పొందడానికి సమస్యలుంటాయని వివరించారు. అందువల్ల అర్హుల ఓట్లు ఒక్కటి కూడా తొలగకుండా చూడాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, ఎంపీపీ తిమ్మయ్య, నాయకులు ఎన్.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, నారేంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి, కోగిర రవి, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


