సాగుభూముల్లో సోలార్‌ ప్లాంటా..? | - | Sakshi
Sakshi News home page

సాగుభూముల్లో సోలార్‌ ప్లాంటా..?

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

ఎన్‌పీకుంట: వ్యవసాయ యోగ్యమైన సాగు భూముల్లో సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణం చేపడితే రైతులు ఎలా బతకాలని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌ ప్రశ్నించారు. మండల పరిధిలోని మరికొమ్మదిన్నె, గౌకనపల్లి, వెలిచలమల, వంకమద్ది, ధనియానిచెరువు పంచాయతీల్లో సుమారు 15 వేల ఎకరాలలో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, వివిధ కంపెనీలు రైతుల ప్రమేయం లేకుండానే వారి భూముల్లో డ్రోన్‌తో సర్వే చేపడుతున్నాయి. దీన్ని నిరసిస్తూ రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కొత్తరంగారెడ్డి, సీనియర్‌ నాయకులు బాలకృష్ణనాయుడు, జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌ బాషా, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నళ్లజోడు పవన్‌ హాజరై రైతులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కూడలిలో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కదిరి– రాయచోటి ప్రధాన రహదారిపై ౖబైఠాయించి నిరసన తెలిపారు.

సమ్మతం లేకుండా భూములు ఎలా తీసుకుంటారు?

వ్యవసాయ యోగ్యమైన భూముల్లో సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టడమే తప్పని, అలాంటిది రైతుల సమ్మతం కూడా లేకుండా వారి భూముల్లో డ్రోన్‌ ద్వారా సర్వేలు ఎలా చేపడతారని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్‌ అహ్మద్‌ ప్రశ్నించారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు...కమీషన్ల కక్కుర్తితో రైతుల కడుపు కొట్టాలని చూస్తున్నారన్నారు. వెంటనే బలవంతపు భూసేకరణ ఆపేయాలని, సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతుల తరఫున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి పూలశ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ... అధికార పార్టీ నాయకులు వారి స్వలాభం కోసం రైతులను బలిచేసేందుకు సిద్ధమయ్యారన్నారు. దౌర్జన్యంగా రైతుల నుంచి ఒకరం భూమి తీసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. పంటలు పండని ఎడారి ప్రాంతాల్లో సోలార్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు.

జగన్‌ దృష్టికి తీసుకెళ్తాం

మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా మాట్లాడుతూ... భూసేకరణ సమయంలో భూములు కోల్పోతున్న రైతులకు నోటీసులు ఇచ్చి గ్రామసభల ద్వారా అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉన్నా...ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో భూములు కోల్పోయిన రైతులకే ఇంకా సరిగా పరిహారం అందలేదని, ఇప్పుడు మళ్లీ రైతులను మోసం చేస్తూ భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకు నాయకులు, రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌ లక్ష్మమ్మకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కేశవరెడ్డి, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, వైఎస్సార్‌ సీపీ పంచాయతీరాజ్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.పుల్లారెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోవిందునాయక్‌, వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తిరుమలనాయుడు, అంజన్‌రెడ్డి, రామచంద్ర, ఆటోకిష్టా, ఆదెప్పనాయుడు, గంగాద్రి, రఘునాథ, బుల్లెట్‌బాబా, చెన్నక్రిష్ణారెడ్డి, దుద్దుకుంట వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఆంజన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రంగారెడ్డి, యాదళ్ల రాజేష్‌, సూర్యనారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, స్వామిరెడ్డి, సీపీఐ నాయులు హసన్‌ పాల్గొన్నారు.

కమీషన్ల కక్కుర్తితో రైతుల పొట్ట కొట్టొద్దు

హితవు పలికిన వైఎస్సార్‌ సీపీ నేతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement