పారిశ్రామిక ప్రగతితోనే జిల్లా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక ప్రగతితోనే జిల్లా అభివృద్ధి

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

ప్రశాంతి నిలయం: పారిశ్రామిక ప్రగతిపైనే జిల్లా అభివృద్ధి ఆధారపడి ఉంటుందని, అందువల్ల నూతన పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు వీలైనంత త్వరగా ఇవ్వాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ సంబంధిత ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల మేరకు సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు నిర్దేశించిన కాలపరిమితి లోపే అన్ని అనుమతులూ మంజూరు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ వీలైనంత త్వరగా పరిశ్రమలను ఉత్పత్తి దశకు తీసుకురావాలన్నారు. కొత్తగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) స్థాపించే వారికి కావలసిన వసతులను అధికారులు దగ్గరుండి కల్పించాలన్నారు. పీఎం విశ్వకర్మ, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ వారితో కలిసి ఎంఎస్‌ఎంఈలలో డిజిటల్‌ సర్వే నిర్వహించాలన్నారు. అనంతరం జూలై 6న నిర్వహించనున్న రీజనల్‌ వర్క్‌షాప్‌ గురించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.

భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలి

భూరికార్డులను పక్కాగా నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు, రెవెన్యూ దరఖాస్తులను గడువులోపు పరిష్కారించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి కలెక్టరేట్‌ నుంచి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలో రీ సర్వే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. అర్హులైన రైతులకు 100 శాతం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, ఫిర్యాదులను ఆర్డీఓలు, తహసీల్దార్లు పర్యవేక్షిస్తూ పరిష్కరించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు చెరువులు, కుంటలు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ విజయకుమారి, సర్వే అధికారి విజయశాంతి పాల్గొన్నారు.

డీఈఓ కార్యాలయం ప్రారంభం

పుట్టపర్తి: కొత్తచెరువులోని బాలుర ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, డీఈఓ కిష్టప్ప తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్‌ కట్‌ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

పరిశ్రమల అనుమతులను వేగవంతం చేయండి

అధికారులకు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement