ఉరవకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి జపం తప్ప పేదల సంక్షేమం పట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. బుధవారం స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతుల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమరావతి ముసుగులో వేల కోట్లు దోపిడీ చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రూపాయి విలువ పెంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. కేంద్ర ప్రభుత్వం మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంత అభివృద్ధికే నిధులన్నీ ఖర్చు పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అమరావతిలో టీడీపీ ముఖ్య నేతలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి దయనీయంగా ఉందని, ఎరువులు, మందులు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.


