పాఠశాల వరండాలో చదువులు
శిథిలావస్థకు చేరిన పాఠశాల అదనపు గది
నల్లచెరువు: మండల పరిధిలోని రమణప్పగారిపల్లి ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. గదుల కొరతతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ 28 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. హెచ్‌ఎం షేక్ బాబూ సాహెచ్, ఉపాధ్యాయురాలు పద్మావతి విధులు నిర్వర్తిస్తున్నారు. తరగతి గది మాత్రం ఒక్కటే ఉంది. పాఠశాల గదిలోకి వెలుతురు కూడా సరిగా పడక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయంతో చీకట్లు అలముకుంటున్నాయి. గత్యంతరం లేక 2,3,4వ తరగతులను పాఠశాల వరండాలో నిర్వహిస్తున్నారు. పాఠశాల ముందు రోడ్డు గుండా తరచూ ద్విచక్రవాహనాలు, ఆటోలు వెళ్తుంటాయి. ఆ శబ్ధాలకు వరండాలోని పిల్లలు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. పాఠశాల ఆవరణలో వంటగది కూడా లేకపోవడంతో గత్యంతరం లేక మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమ ఇంట్లోనే వంట చేసుకొని వచ్చి పిల్లలకు పెడుతున్నారు. పాఠశాలలో తాగునీటి వసతి కూడా సరిగాలేదు. మరుగుదొడ్ల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు స్పందించి అదనపు గదులు, వంట గది నిర్మించి పిల్లలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


