ధర్మవరం: వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కలిసి వినతిపత్రం అందించారు. సచివాలయ వ్యవస్థలో ఒకే నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఉద్యోగులుగా చేరిన ఇతర కేడర్లతో పోలిస్తే తమ కేడర్‌కు ప్రమోషన్ల ఛానల్‌లో తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కంప్యూటర్ డిగ్రీ విద్యార్హత కలిగిన తమ సాంకేతిక హోదాను పూర్తిగా తొలగించి నాన్ టెక్నికల్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టును ప్రతిపాదించడంతో నష్టం జరుగుతోందన్నారు. ఇతర టెక్నికల్ కేడర్లకు వారి సొంత విభాగాల్లోనే ప్రమోషన్లు కల్పించినట్లుగానే తమకు కూడా విద్యాశాఖ లేదా ఇతర ప్రభుత్వ విభాగాలలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌గా పదోన్నతి కల్పించేలా జీఓ సవరించాలని మంత్రికి విన్నవించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారనిఉద్యోగులు తెలిపారు.
ఎల్‌ఐసీ పాలసీ సొమ్మును మింగిన ఏజెంట్
ధర్మవరం అర్బన్: ఎల్‌ఐసీలో పాలసీ చేసిన సొమ్మును ఓ ఏజెంట్ తన కుమారుడి ఖాతాలోకి మళ్లించాడు. దీంతో బాధితులు పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. కొత్తచెరువు మండలానికి చెందిన ప్రతాప్ రెడ్డి, శ్రీలత తెలిపిన మేరకు... గత 16 సంవత్సరాలపాటు వీరు ఎల్‌ఐసీలో క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించారు. పాలసీ పూర్తయినా డబ్బు అకౌంట్‌లోకి జమ కాలేదు. ఎల్‌ఐసీ ఆఫీస్‌కు వచ్చి విచారిస్తే ఏజెంట్ రాజారెడ్డి తన కుమారుడు అశోక్‌రెడ్డి ఖాతాలోకి డబ్బు బదిలీ చేసినట్లు తెలిసింది. ఎల్‌ఐసీ ఏజెంట్ రాజారెడ్డి వరుసకు బావ అవుతాడని ఏజెంట్, డెవలప్‌మెంట్ ఆఫీసర్ దస్తగిరి కుట్రపన్ని తమకు రావాల్సిన డబ్బు కాజేశారని బాధితులు వాపోయారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని తిప్పేస్వామి (34) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలు... ఒంటిమిద్దికి చెందిన తిప్పేస్వామి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన తిప్పేస్వామి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు తిప్పేస్వామికి భార్య శిల్పక్క, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


