తుమకూరు: శిరా తాలూకా పట్టనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసహళ్లి–బడేనహళ్లి గేట్ మధ్య రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏపీలోని మడకశిర తాలూకా నిద్రగట్ట గ్రామానికి చెందిన రమేష్(35) ఉదంతం మలుపు తిరిగింది. ఎల్‌ఐసీ డబ్బు కోసం ఇతన్ని స్వయానా అన్ననే కడతేర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈమేరకు బెంగళూరు మంజునాథ్ నగర వీడియోటోల్ వద్ద టీ హోటల్ నిర్వహిస్తున్న రమేష్ అన్న హనుమంతరాజు, బెంగళూరు చెన్ననాయకనపాళ్యకు చెందిన లక్ష్మికాంత, తుమకూరు తాలూకా మాచనహళ్లి నివాసి నవీన్ కుమార్, బెంగళూరు పార్లీజీ టోల్ వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న హోటల్‌లో పనిచేసే కోరటెగెరె తాలూకా దేరగానహళ్లి నివాసి ఎండీ జిలాన్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కేవీ అశోక్ వివరాలు వెల్లడించారు. హతుడు రమేష్ ఆరేళ్ల నుంచి ఊరు విడిచి బెంగళూరులో కొబ్బరి బొండాల వ్యాపారం, మండ్యలో చెరుకు జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు. క్షుద్రవిద్యలు నేర్చుకున్న రమేశ్ తన సొంత అన్న హనుమంతరాజు సంసారంపైనే ప్రయోగించి ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. దీంతో రమేశ్‌ను చంపేయాలని హనుమంతరాజు స్కెచ్ వేశాడు. రమేశ్ పేరిట రూ. 15 లక్షల ఎల్‌ఐసీ బీమా చేసి తననే నామినీగా పెట్టుకున్నాడు. ఏటా 85వేలు బీమా కంతును చెల్లిస్తూ వచ్చాడు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి నామినీకి బీమా మొత్తం రెట్టింపు డబ్బు వస్తాయనే ఆశతో వాటిని చెల్లిస్తూ వచ్చాడు. ఈశ్రీక్రమంలో రమేష్ హోసహళ్లి–బడేనహళ్లి గేట్ మధ్య విగతజీవిగా పడి ఉండగా పోలీసులు వెళ్లి పరిశీలించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే మృతుని మరో సోదరుడు రంగనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసు విచారణకు జిల్లా ఎస్పీ కేవీ అశోక్ సుమారు 25 మందితో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. రమేశ్ ఒంటిపై గాయాలను గమనించిన పట్టనాయకనహళ్లి ఎస్‌ఐ హరీష్ పోస్టుమార్టమ్ నివేదిక చూసి వెంటనే ఇది హత్య అని నిర్ధారణకు వచ్చారు. నిందితులను తొలుత అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా రమేష్‌ను అంతమొందించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు.


