అతని ‘దివ్య’ సంకల్పం ముందు వైకల్యం తలవంచింది. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా ఇతరులపై ఆధారపడే వారు ఎందరో నేటి సమాజంలో కనిపిస్తారు. అయితే, ఓ దివ్యాంగుడు ఎవరిపైనా ఆధారపడకుండా స్వశక్తితో ఉన్నతంగా జీవిస్తుండడమే కాకుండా మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురంలోని మున్నా నగర్‌కు చెందిన షాషావలి ఐదేళ్ల వయసున్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. దీంతో ఒక కాలు అవిటిదైపోగా, షాషావలి చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యాడు. అయితే, అంతటితో కుంగిపోలేదు. స్వతహాగా కష్టపడే మనస్తత్వమున్న షాషావలి 8 ఏళ్ల క్రితం అప్పటి కలెక్టర్ వీరపాండియన్ ప్రోత్సాహంతో కలెక్టరేట్ ఎదురుగా వెల్డింగ్ షాపు నెలకొల్పాడు. సంకల్ప బలంతో ముందుకు సాగాడు. కచ్చితత్వంతో పనులు చేయడంతో ఆదరణ లభించింది. ప్రస్తుతం గ్రిల్స్, ఇనుప గేట్లు తదితర పనులను కూడా అవలీలగా చేసేస్తున్నాడు. తను ఉపాధి పొందడమే కాకుండా షాపులో మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాడు. దివ్యాంగుడైన షాషావలిని గతంలో కొందరు హేళన చేశారు. ‘చదువు లేదు.. పైగా దివ్యాంగుడు, ఎలా బతుకుతావురా’ అంటూ చుట్టుపక్కల వారు చులకనగా మాట్లాడారు. అయినా, కుంగిపోకుండా ముందుకు సాగి నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


