తలుపుల: అతివేగానికి యువకుడు బలయ్యాడు. మండలంలోని పులిగుండ్లపల్లి పంచాయతీలోని అగ్రహారంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని కొవ్వూరివాండ్లపల్లికి చెందిన చాకలి ఓబులేసు కుమారుడు విష్ణువర్దన్ (19) తిరుపతిలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం ఉదయం విష్ణువర్దన్ తన పెదనాన్న కుమారుడు ఓబులేసుతో కలిసి ద్విచక్రవాహనంలో వెలిచెలమల క్రాస్‌కు వెళ్లాడు. బట్టలు ఉతకడానికి అవసరమైన బ్లీచింగ్, సోడా తీసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. అగ్రహారంపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆపి ఓబులేసు బహిర్భూమికి వెళ్లగా విష్ణువర్దన్ బైకు వద్దే నిల్చున్నాడు. ఈ క్రమంలోనే తలుపుల వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఆదినారాయణ బైకు వద్ద నిల్చున్న విష్ణువర్దన్‌ను ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలైన విష్ణువర్దన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ ఆదినారాయణ పరారయ్యాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు. విష్ణుకుమార్ మృతదేహం వద్ద వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులు రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


