ఖాశీంస్వామికి నిత్యపూజ నివేదన | - | Sakshi
Sakshi News home page

ఖాశీంస్వామికి నిత్యపూజ నివేదన

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

బత్తలపల్లి: మొహర్రం వేడుకల్లో భాగంగా బత్తలపల్లి ఖాశీంస్వామికి మంగళవారం నిత్యపూజ నివేదన నిర్వహించారు. తెల్లవారుజామున ముజావర్లు టైలర్‌ రియాజ్‌, నజరుల్లా, మాభాషా, ఖాశీంవలి.. పీర్ల చావిడిలో ఫాతెహ చేశారు. అదేవిధంగా మండలంలోని గంటాపురం, వేల్పుమడుగు, ముష్టూరు, మాల్యవంతం, సంజీవపురం, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, అనంతసాగరం, వెంకటగారిపల్లి, డి.చెర్లోపల్లి తదితర గ్రామాల్లోనూ పీర్ల మకాన్‌లలో పూజలు నిర్వహించారు.

నేటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

అనంతపురం: ఏపీ పాలిసెట్‌–2026 కౌన్సెలింగ్‌ బుధవారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుంచి సర్టిఫికెట్‌ పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సి.జయచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ ప్రక్రియ కొనసాగనుందన్నారు. ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ధ్రువీకరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ఉంటుందన్నారు. 4న ఆప్షన్లలో మార్పు, 6న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. జూలై 7 నుంచి 10 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌తో పాటు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను స్పష్టంగా స్కాన్‌ చేసి అప్లోడ్‌ చేయాలని ఆయన సూచించారు.

ముగిసిన ఎంటీఎస్‌ కౌన్సెలింగ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: తీవ్ర గందరగోళం మధ్య ఎంటీఎస్‌ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌ మంగళవారం అనంతపురంలోని సైన్స్‌ సెంటర్‌లో ముగిసింది. 2008 డీఎస్సీకి సంబంధించి ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 14 మందికి కౌన్సెలింగ్‌ లేకుండా వారు పని చేస్తున్న పాఠశాలల్లోనే స్థానాలను యథాతథంగా కేటాయించారు. మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలిపినా, అధికారులు పట్టించుకోలేదు. చాలా ఎంటీఎస్‌ టీచర్లు కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోయినా నిర్బంధంగా ప్రక్రియ పూర్తి చేశారు. కాగా గత ఏడాది జిల్లాలో దాదాపు 80 మంది క్లస్టర్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, ఇప్పుడు తమకు కేటాయించిన పాఠశాలలను కూడా ఖాళీల జాబితాలో చూపించలేదని పలువురు ఉపాధ్యాయులు వాపోయారు. ఖాళీల జాబితా తయారీ నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహణ వరకు పారదర్శకత లోపించిందని ఆరోపించారు.

నమ్మించి.. ఉసూరుమనిపించిన ఎమ్మెల్సీ

డీఎస్సీ–1998 ఎంటీఎస్‌ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌ వ్యవహారం మంగళవారం గందరగోళానికి దారి తీసింది. ఖాళీలు బ్లాక్‌ చేశారని, అందుబాటులో ఉన్న పోస్టులను చూపడం లేదని ఆరోపిస్తూ ఎంటీఎస్‌ టీచర్లు సోమవారం జరగాల్సిన కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. తమ సమస్యలను ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందిస్తూ ‘ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తాను’ అంటూ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్సీ.. తాను విద్యాశాఖ కమిషనర్‌తో మాట్లాడతానని, అప్పటిదాకా కౌన్సెలింగ్‌ నిర్వహించవద్దని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. సాయంత్రం దాకా రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ముందుగా ప్రకటించిన ఖాళీలతోనే విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement