భూ సేకరణ వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణ వేగవంతం చేయండి

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

ప్రశాంతి నిలయం: ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కులకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి పారిశ్రామిక పార్కులు ఎంతో కీలకమన్నారు. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, పుట్టపర్తి, మడకశిర మండలాల్లో వివిధ గ్రామాల్లో ప్రతిపాదించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వెంటనే భూ సేకరణ పనులు ప్రారంభించాలన్నారు. పెండింగ్‌ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్‌, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులకు ..

పుట్టపర్తి నియోజకవర్గంలో మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులకు నీటిని అందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూ సేకరణ, సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. నియోజకవర్గంలో 195 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని తరలించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రావిటీ, లిఫ్ట్‌ ద్వారా ఈ చెరువులకు నీటిని అందిస్తారన్నారు. అధికారులు సమన్వయంతో సర్వే, పెగ్‌ మార్కెంగ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. ఎస్‌డీ రికార్డులు, భూ గణన పత్రాలను వెంటనే సిద్ధంచేయాలన్నారు.

విధుల్లో అలసత్వం సహించేది లేదు

జిల్లాలో ఎవరైనా విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం పక్కాగా అమలు చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విత్తన బాల్స్‌ తయారు చేసి కొండ ప్రాంతాల్లో చల్లాలన్నారు. స్వచ్ఛంధ్రా–స్వర్ణాంధ్రా కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. గృహ నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ విజయ కుమారి, హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్‌, అటవీ అధికారి శ్రీనివాసులు, నీటి పారుదల ఈఈ గురుమూర్తి, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement