టీడీపీ నేతల పైశాచికం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల పైశాచికం

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

రామగిరి: అధికారం అండతో ‘పచ్చ’ నేతలు బరితెగించారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ కోర్టు పరిధిలో ఉన్న భూమిని రెండురోజుల క్రితం దున్నేశారు. ఈ ఘటన రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం కొత్త గ్యాదికుంటలో చోటుచేసుకుంది.

రెండేళ్ల క్రితమే దుర్మార్గ చర్య

రామగిరి మండలం కొత్త గ్యాదికుంటలో సర్వేనంబరు 488–3, 488–4, 488–5లోని 7.75 ఎకరాలను కొన్నేళ్లుగా దళితులైన పెద్దక్క, శివయ్య సాగుచేసుకుంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చీనీ తోటను టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు. తోటలోని 535 చినీచెట్లను నరికేయగా, అప్పట్లో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ టీడీపీ నేతలు ముత్యాలనాయుడు, రామలింగ, పోతన్న, తిప్పన్న రెండురోజుల క్రితం ఉద్దేశపూర్వకంగా చీనీ తోటలున్న భూమిని దున్నేశారు. ‘ఇప్పుడు పొలమే దున్నాం...అడ్డం వస్తే మనుషులనే గొయ్యితీసిపాతేస్తాం’’ అని హెచ్చరించడంతో బాధితులు కనీసం పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయలేని దుస్థితి నెలకొంది.

ఎమ్మెల్యే పరిటాల అండతో దళితుల పొలాన్నే దున్నేసిన వైనం

గతంలోనే 535 చినీచెట్లను నరికిన టీడీపీ నేతలు

కోర్టు ఆదేశాలను ధిక్కరించి దుర్మార్గం

న్యాయ పోరాటం చేస్తాం

మా సాగులో ఉన్న భూమి ప్రభుత్వానిది. కానీ 1996లో ఈ భూమి తనదేనని కొత్తగ్యాడికుంటకు చెందిన చెన్నప్ప చెప్పగా కొనుగోలు చేశాం. డి.పట్టా కావడంతో అప్పట్లో రిజిస్ట్రేషన్‌ కాలేదు. దీనిపై నిలదీసినా కొత్తగ్యాడికుంట చెన్నప్ప సమాధానం చెప్పలేదు. దీంతో అధికారుల చుట్టూ తిరిగాం. మా పరిస్థితి చూసి సాగులో ఉన్నామని నిర్ధారించుకున్న తర్వాత అధికారులు మా పేరుతో డి.పట్టా ఇచ్చారు. గ్రామంలో మేం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులుగా ఉండటంతో టీడీపీ నేతలు కక్షగట్టి ఇప్పుడు మా భూమి మా కాకుండా చేస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం.

– పెద్దక్క, శివయ్య, బాధిత రైతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement