పుట్టపర్తి టౌన్: జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక పరేడ్ మైదానంలో డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 56 దరఖాస్తులు రాగా 12 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 34 మంది మాత్రం అర్హత సాధించారు. అర్హత సాధించిన వారికి ఎత్తు, బరువు, కొలతలతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాడింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, మెడిసిన్ ఫుట్‌బాల్, షటిల్ రన్ వంటి వివిధ మోటార్ ఎబిలిటీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపుతారు. అక్కడ ఉత్తమ ప్రదర్శన కనబరచిన వారిని స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక చేస్తామన్నారు. కోచ్‌లు హుస్సేన్, ఓంప్రకాశ్, ప్రతాప్, రెడ్డెప్ప, శబరి, రిజ్వాన ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి.


