దివ్యాంగుల జాతీయ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల జాతీయ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

అనంతపురం: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో సోమవారం దివ్యాంగుల జాతీయ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభమైంది. ఇండియన్‌ డెఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ సైనీ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. డెఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ ప్రధాన కార్యదర్శి రఘు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, ముంబై, తెలంగాణ, కర్ణాటక జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌ –హర్యానా, తెలంగాణ–ఢిల్లీ, గుజరాత్‌– కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌– మధ్యప్రదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగినట్లు నిర్వాహణ కమిటీ కార్యదర్శి ఎస్‌. నాగరాజు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి దుర్మరణం

మరో ఇద్దరికి గాయలు

కనగానపల్లి: మండల పరిధిలోని మామిళ్లపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. తగరకుంట గ్రామానికి చెందిన నాగన్న, ఉమాక్క దంపతుల కుమారుడు బిల్లే మహేష్‌ (21), అతని మామ పెన్నప్ప, అత్త శ్రావణిలు చెన్నేకొత్తపల్లిలోని వారి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లి వస్తుండగా, రాత్రి వేళ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. స్థానికులు గుర్తించి 108 ద్వారా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లుండగా, మహేష్‌ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. గాయపడ్డ పెన్నప్ప, శ్రావణిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మృతుని తల్లిదండ్రులు నాగన్న, ఉమాక్క, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. సంఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

9 మంది బైండోవర్‌

కదిరి టౌన్‌: కదిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి వినియోగం, నేర స్వభావం కలిగిన 9 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. కదిరికి చెందిన కలైకం మహమ్మద్‌ జుబేర్‌, ఎం.నవీద్‌, ఎస్‌.భరద్వాజ్‌, సాకే పవన్‌కుమార్‌, ఈ.శ్రీకాంత్‌, పవన్‌కుమార్‌, వి.బాలు, ఎం.చరన్‌ తేజ్‌, షేక్‌ అప్నాన్‌పై సోమవారం బైండోవర్‌ కేసులు నమోదు చేసి కదిరి తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉండాలని ఆదేశిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల విలువైన బాండ్లు తీసుకున్నట్లు వివరించారు.

కోర్టుకు హాజరు

కాకుంటే జైలుకే

కదిరి టౌన్‌: కేసుల్లో నిందితులుగా ఉన్న వారు కోర్టుకు హాజరు కాకుంటే జైలుకు పంపుతామని కదిరి సీఐ వి.నారాయణరెడ్డి హెచ్చరించారు. కదిరి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 50 మంది కొంత కాలంగా కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా ఉన్నారన్నారు. వారంతా రెండు, మూడు రోజుల్లో కోర్టులో హాజరుకాని పక్షంలో అరెస్టు చేసి జైలుకు తరలిస్తామన్నారు. సోమవారం రాయచోటి పట్టణానికి చెందిన పూలంగిరి హసినా, షేక్‌ గులాబ్‌ జామ్‌లను అరెస్టు చేసి అనంతపురం జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

ప్రేమ విఫలమై

యువకుడి బలవన్మరణం

గుత్తి రూరల్‌: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుత్తి మండలం యంగన్నపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ జిల్లా సారా గ్రామానికి చెందిన మున్నా కుమారుడు అమన్‌ (20) అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. సదరు యువతి ప్రేమకు నిరాకరించడంతో ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడు. కుమారుడిని మార్చాలని భావించిన తల్లిదండ్రులు గుత్తి మండలంలోని బేతాపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న సోలార్‌ ప్లాంటులో ఓ కాంట్రాక్టర్‌ వద్దకు కూలీ పనులకు పంపారు. అమన్‌తో పాటు ఇతర కూలీలు నివాసం ఉండేందుకు కాంట్రాక్టర్‌ చెట్నేపల్లిలో ఓ ఇల్లు చూపించాడు. అమన్‌ కూలీ పనులకు వెళ్లినా అక్కడ కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక్కడే ఉండేవాడు. తాను చనిపోతానని రోజూ తోటి కూలీలతో చెప్పేవాడు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి యంగన్నపల్లి శివారులోని బాలరాజు మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement