సమస్యలు పరిష్కరించండి సారూ | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి సారూ

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

ప్రశాంతి నిలయం: ‘‘ఎన్నిసార్లు అధికారులకు అర్జీలిచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మీరైనా మాపై దయచూపి మా సమస్యలు పరిష్కరించండి సార్‌’’ అంటూ ప్రజలు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్‌ కిటకిటలాడింది. వివిధ సమస్యలపై మొత్తంగా 387 అర్జీలు ఇచ్చారు. కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ కొండయ్య, ఎస్‌డీసీ విజయకుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులతో సమావేశమయ్యారు. పరిష్కార వేదికలో అందిన అర్జీలన్నీ గడువులోపు పరిష్కరించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు.

దివ్యాంగ బాలికకు పింఛన్‌, పట్టా

కొత్తచెరువుకు చెందిన ఓ దివ్యాంగ బాలికకు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అండగా నిలిచారు. కొత్తచెరువుకు చెందిన సాయిలీల, మంజునాథ్‌ దంపతుల కుమార్తె శిరీష దివ్యాంగురాలు. గత వారం తనకు పింఛన్‌, ఇంటి పట్టా మంజూరు చేయాలని శిరీష ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు అర్జీ ఇచ్చింది. కుటుంబ పరిస్థితిని గమనించిన కలెక్టర్‌... సోమవారం ఇంటి పట్టాతో పాటు పింఛన్‌ మంజూరు చేసి సంబంధిత పత్రాలు అందజేశారు. దీంతో జిల్లా యంత్రాంగానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

సదరంలో ‘జీరో’ వేశారు

‘‘2004లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నా రెండు కాళ్లు విరిగాయి. వెన్నెముక కూడా దెబ్బ తినింది. రెండుసార్లు శస్త్ర చికిత్సలు చేశారు. అయినా నడవలేను. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బంది మారింది. పింఛన్‌ అయినా వస్తుందన్న ఆశతో సదరం శిబిరానికి వెళితే జీరో పర్సెంటేజీ వేశారు. ఆస్పత్రిలో డబ్బులిచ్చిన వారికే సదరం సర్టిఫికెట్‌లో పర్సెంటేజీ పెంచి వేస్తారంట.. మీరైనా న్యాయం చేయండి’’ అని పుట్టపర్తి మండలం రాచువారిపల్లికి చెందిన చంద్ర ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ను వేడుకున్నారు.

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 387 అర్జీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement