గోరంట్ల: కళ్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్.. నమ్మి ఓట్లేసిన జనాన్ని నట్టేట ముంచిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. మాటల ప్రభుత్వాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. గురువారం ఆమె పార్టీ మండల కన్వీనర్ వెంకటేశుతో కలిసి మండల పరిధిలోని బెల్లాలచెరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు పాలనలో ఎలాంటి లబ్ధి కలిగిందంటూ ఆరా తీశారు. రెండేళ్లలో తమకు ఎలాంటి సంక్షేమ పథకం అందలేదని, గ్రామంలోనూ అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు వాపోయారు. ఏదైనా సమస్య తలెత్తితే పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ ప్రజలతో మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో కుల,మత రాజకీయలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు విత్తనాలు, యూరియా సైతం అందించలేని దుస్థితిలో ఉందన్నారు. అనంతరం సమగ్ర ఓటరు ప్రత్యేక సర్వే (సర్)పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బీఎల్‌ఏలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఓటు జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాలన్నారు.
‘సర్’పై అందరూ
అప్రమత్తంగా ఉండాలి
వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


