మడకశిర: మూడు నెలలుగా తాగునీటి కోసం ముప్పుతిప్పలు పడుతున్నా పట్టించుకోని పాలకులు, అధికారుల తీరుపై మహిళలు మండిపడ్డారు. ఏకంగా ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో పాటు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్నా...
మడకశిర మున్సిపాలిటీ 8వ వార్డులోని టైలర్స్ కాలనీకి మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచి పోయింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. స్థానికేతరుడైన ప్రజాప్రతినిధి పత్తాలేకుండా పోయారు. దీంతో బుధవారం కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రోడ్డుపై బైఠాయించి ముళ్ల కంపలు రోడ్డుకు అడ్డంగా వేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. మూడు నెలలుగా కాలనీకి తాగునీరు సరఫరా చేయకపోవడంతో సొంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాల కోసం నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. సమస్య గురించి పలుసార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి టైలర్స్ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు డిమాండ్ చేశారు.
మడకశిరలో మహిళల ఆందోళన
ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు
మున్సిపల్ కార్యాలయం ముట్టడి


