కదిరి: అన్నదాతలపై పైసా భారం పడకుండా గత ప్రభుత్వం ఐదేళ్లూ విజయవంతంగా అమలు చేసిన ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’కు చంద్రబాబు అధికారంలోకి రాగానే మంగళం పాడారు. ఈ పథకం స్థానంలో 2019కి పూర్వం ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు వాతావరణ ఆధారిత బీమాను తీసుకొచ్చారు. ఫసల్ బీమా కింద కంది, జొన్న, వరి తదితర పంటలున్నాయి. వాతావరణ ఆధారిత బీమా పరిధిలో వేరుశనగ, అరటి వంటి పంటలున్నాయి. వరి పంటను గ్రామం యూనిట్‌గా, వేరుశనగను మండలం యూనిట్‌గా, కంది, జొన్న పంటలను జిల్లా యూనిట్‌గా పరిగణించారు. జగన్ హయాంలో బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తే ఈ ప్రభుత్వం ఆ భారం రైతుపై మోపింది.
రెండేళ్లలో రూ.360 కోట్ల నష్టం
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రెండు ఖరీఫ్, రెండు రబీ సీజన్‌లు పూర్తయ్యాయి. ఈ జూన్ నుంచి మళ్లీ ఖరీఫ్ ప్రారంభమైంది. ఈ రెండేళ్లలో ఒక్క రైతు కూడా బీమా ద్వారా లబ్ధి పొందలేదు. జిల్లాలో 2.96 లక్షల మంది రైతులున్నారు. వీరు ఏటా సరాసరిన రూ. 180 కోట్లు చొప్పున రెండేళ్లలో రూ.360 కోట్ల వరకు నష్టపోయారు.
తప్పెవరిది?
కేంద్రం తన వంతు ప్రీమియం వాటాను విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా పెండింగ్‌లో ఉన్నందున రైతులు బీమా సొమ్ము నష్టపోతున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజాప్రతినిధుల మాట అందుకు భిన్నంగా ఉంది. పంట నష్టం అంచనా వేయడంలోను, అలాగే క్షేత్ర స్థాయిలో పంటకోత ప్రయోగాల ఆధారంగా తుది జాబితా ప్రకటించడంలో అధికారులు చేసిన తప్పిదమేనని వారంటున్నారు. అంతిమంగా నష్టపోయింది మాత్రం అన్నదాతలే.
అప్పుడు రూ.718 కోటు లబ్ధి
జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాతో జిల్లా రైతులకు ఎంతో లబ్ధి చేకూరింది. కదిరి నియోజకవర్గంలో 55,755 మంది రైతులకు రూ107.53 కోట్లు, ధర్మవరంలో 47,870 మంది రైతులకు రూ. 191.48 కోట్లు, పుట్టపర్తిలో 67,045 మందికి రూ. 78.8 కోట్లు, హిందూపురంలో 17,415 మంది రైతులకు రూ. 36.22 కోట్లు, మడకశిరలో 38,198 మంది రైతులకు రూ. 79.29 కోట్లు, పెనుకొండలో 24,276 మంది రైతులకు రూ. 99.29 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలో జిల్లా పరిధిలో ఉన్న మూడు మండలాలకు చెందిన 60,118 మంది రైతులకు రూ125.96 కోట్ల లబ్ధి చేకూరింది.
ఉచిత పంటల బీమాను
పక్కన పెట్టిన బాబు సర్కారు
ఫసల్‌బీమా పేరుతో ప్రీమియం
కట్టించుకున్న ప్రభుత్వం
రెండేళ్లుగా రైతుల ఖాతాల్లో
జమకాని బీమా సొమ్ము
గత ప్రభుత్వంలో విజయవంతంగా ఉచిత బీమా పథకం అమలు
ప్రీమియం
చెల్లించిన రైతులకే బీమా
వాతావరణ బీమా ఏదైనా సరే.. ప్రీమియం చెల్లించిన వారికే వర్తిస్తుంది. అలాగే ప్రీమియం చెల్లించినప్పటికీ ఈ–క్రాప్ నమోదు చేయకపోతే బీమా రాదు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజనకు కూడా ఈ–క్రాప్ తప్పనిసరి. బీమా నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్న మాట వాస్తవమే.
–నారాయణ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి
ముదిగుబ్బ మండలం మర్తాడుకు చెందిన నారాయణరెడ్డి గత ఏడాది ఖరీఫ్‌లో 12 ఎకరాల్లో వేరుశనగ వేశాడు. వర్షాభావంతో పంట పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడులు కూడా చేతికందలేదు. మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో క్రాప్‌లోన్ ఉన్నందున బ్యాంకర్లు ఫసల్‌బీమా పేరుతో ప్రీమియం డబ్బు కట్టించుకున్నారు.కానీ ఆయనకు ఇంత వరకూ బీమా సొమ్ము అందలేదు. ఈ సమస్య ఈ ఒక్క రైతుదే కాదు. జిల్లాలోని రైతులందరిదీ ఇదే సమస్య. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రైతుకు కూడా పంటల బీమా అందలేదు.


