రైల్లో దోపిడీ షోలాపూర్‌ గ్యాంగ్‌ పనేనా? | - | Sakshi
Sakshi News home page

రైల్లో దోపిడీ షోలాపూర్‌ గ్యాంగ్‌ పనేనా?

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

గుత్తి రూరల్‌: గుత్తి శివారులో రైలులో దోపిడీకి పాల్పడింది షోలాపూర్‌ గ్యాంగ్‌ పనేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని బాపట్ల వద్ద, గుత్తి శివారులో ఒకే రోజు ఒకే సమయంలో రైలులో ప్రయాణిస్తున్న వారి బంగారు, విలువైన వస్తువులు, సెల్‌ఫోన్లను అపహరించారు. గుత్తి శివారులో 2025 ఏప్రిల్‌లో ఇదే తరహాలో సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి నిలిపి ఉంచిన రైళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి నుంచి గుత్తి శివారులోని పెద్ద బ్రిడ్జి వద్ద ప్రతి రోజూ ఇద్దరు ఆర్పీఎఫ్‌ పోలీసులను గస్తీకి ఉంచేవారు. ఇటీవల ఎక్కడా గస్తీ లేకపోవడం పసిగట్టిన దొంగలు కార్యాచరణ అమలు చేశారు.

ప్రయాణికుల ముసుగులో చేరతారు..

ముఠాలోని ఇద్దరు సభ్యులు రిజర్వేషన్‌ చేయించుకుని ప్రయాణిస్తూ బందోబస్తు పోలీసులు లేని కోచ్‌లలోకి ప్రవేశించి, ఎంతమంది మహిళలు బంగారు ధరించారు అనే విషయాలను ముఠా సభ్యులకు చేరవేసి దోపిడీలకు పాల్పడటం వారి నైజం. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లో ఆర్పీఎఫ్‌ పోలీసులు గస్తీకి వెళ్లి ఉంటే దోపిడీ జరిగేది కాదని పలువురు చెబుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బందోబస్తు ఉన్న పోలీసులు ఏసీ బోగీలోకి వెళ్లి పడుకుంటారని, దీంతో దొంగలకు దోపిడీ సులువవుతోందంటున్నారు. గుత్తి శివారులో రైల్వే ట్రాక్‌లకు సమాంతరంగా జాతీయ రహదారులు ఉండటంతో సులువుగా ఉడాయిస్తున్నారు. ఆర్పీఎఫ్‌ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుని గుత్తి శివారులో పెద్ద బ్రిడ్జి, తురకపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో, గుత్తి–జక్కలచెరువు మధ్యలో రోజూ రాత్రి సమయాలలో గస్తీ పెంచి దోపిడీలను అరికట్టాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement