హాకీలో ‘కడప’కు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

హాకీలో ‘కడప’కు అన్యాయం

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

ధర్మవరం/ధర్మవరం అర్బన్‌: తమకు అన్యాయం జరిగిందంటూ హాకీ క్రీడాకారులు హాహాకారాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌కు అర్హత సాధించిన జట్టును తప్పించి తమకు ఇష్టమొచ్చిన జట్లకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ నిర్వహించిన హాకీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకపక్షంగా విజేతలను ప్రకటించారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి క్రీడాకారులకు అన్యాయం చేశారు.

కడపను ఓడించే కుట్ర..

ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ 16వ రాష్ట్రస్థాయి సీనియర్‌ పురుషుల హాకీ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా జట్టు నంద్యాల, ప్రకాశం, కాకినాడ జట్లతో తలపడి మూడు మ్యాచ్‌ల్లోనూ జయకేతనం ఎగురవేసి క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అయితే క్వార్టర్‌ ఫైనల్స్‌లో తిరుపతి జిల్లా జట్టు తలపడాల్సి ఉండగా... తిరుపతి, గూడూరు క్రీడాకారులను కలిపి ఆడిస్తామని నిర్వాహకులు చెప్పడంతో కడప జిల్లా క్రీడాకారులు, కోచ్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో హాకీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు చాణుక్యరాజు, ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్‌ తదితరులు వైఎస్సార్‌ కడప జిల్లా జట్టును మిగతా మ్యాచ్‌లు ఆడనివ్వకుండా పక్కనపెట్టారు. సోమవారం సెమీస్‌, ఫైనల్స్‌ జరగాల్సి ఉండగా... కేవలం ఫ్రెండ్లీ మ్యాచ్‌లా నిర్వహించి అనకాపల్లి, అన్నమయ్య జిల్లా జట్లను జాయింట్‌ విన్నర్స్‌గా ప్రకటించారు. దీనిపై కడప జిల్లా హాకీ జట్టు కెప్టెన్‌ యాసిన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ఇలా క్రీడాకారులకు తీరని అన్యాయం చేయడం దుర్మార్గమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన టోర్నీ నిర్వాహకుల గురించి ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు విన్నవించి వినతిపత్రం అందించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత

సాధించినా ఆడించని వైనం

ఏకపక్షంగా విజేతల ప్రకటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement