లేపాక్షి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పారదర్శకంగా చేపట్టాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శనివారం ఆయన లేపాక్షి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, బూత్ కన్వీనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రతి ఓటరు కార్డునూ నిశితంగా పరిశీలించాలన్నారు. ఏదైనా అనుమానం ఉంటే బీఎల్‌ఓలను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. అర్హుల ఓట్లు తొలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ కలిసి స్వచ్ఛ ఓటరు జాబితాకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామి రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజన్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
చిలమత్తూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని కార్యాలయ అధికారులను ఆదేశించారు. ‘సర్’ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ విషయంలోనైనా అనుమానం తలెత్తితే వెంటనే జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించాలని తెలిపారు.
బీఎల్‌ఓలు ఎక్కడ? : బీఎల్‌ఓల ప్రత్యేక క్యాంపులు, ఓటరు మ్యాపింగ్ పనులను పరిశీలించిన జేసీ భరద్వాజ్... అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పెషల్ క్యాంపు జరుగుతున్న సమయంలో బీఎల్‌ఓలు ఒక్కరూ అందుబాటులో లేకపోవడాన్ని ఎలా చూడాలని తహసీల్దార్ లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. బీఎల్‌ఓలు అందరూ వచ్చారని చెబుతున్నారని, కానీ ఒక్క బీఎల్‌ఓ కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2002–2205 మధ్య అర్హులైన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి, నోట్ క్యామ్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. బీఎల్‌ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సెలవురోజు..
ఇసుక తవ్వకాల జోరు
● పుట్టపర్తిలో ఇసుక తోడేళ్లు!
● చిత్రావతి నుంచి భారీగా ఇసుక రవాణా
పుట్టపర్తి టౌన్: పట్టణం సమీపంలోని చిత్రావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండతో జోరుగా ఇసుక దందా చేస్తున్నారు. సాయినగర్, దుర్గమ్మగుడి తదితర ప్రాంతాల నుంచి చిత్రావతి నదిలోని ఇసుకను ఇష్టానుసారం తోడేస్తున్నారు. ముఖ్యంగా రెండో శనివారం, ఆదివారం తదితర సెలవు రోజులతో పాటు పండుగల సమయంలో పోలీసులు, అధికారుల నిఘా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా రోజుల్లో వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక దందా కూటమి నేతల కనుసన్నల్లోనే కొనసాగుతుండటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణా అడ్డుకోకపోతే పుట్టపర్తికి తాగునీటి కష్టాలు తప్పవని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


