విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

Jun 13 2026 1:23 PM | Updated on Jun 13 2026 1:23 PM

మునిసిపల్‌ అధికారులకు

కలెక్టర్‌ హెచ్చరిక

పుట్టపర్తి టౌన్‌: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మునిసిపల్‌ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన పుట్టపర్తి మునిసిపల్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది హాజరు శాతం, ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పుట్టపర్తి పట్టణం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో దేశవిదేశాల నుంచి సత్యసాయి భక్తులు వస్తుంటారని, కావున పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలు గడువులోపు పరిష్కరించాలన్నారు. పట్ణణంలో సీసీ రోడ్లు, వీధి దీపాల నిర్వహణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. విధులకు ఆలస్యంగా వచ్చినా, ప్రజాసమస్యలపై అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి హాకీ

చాంపియన్‌షిప్‌ ప్రారంభం

ధర్మవరం: ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసేందుకు టోర్నీలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం 16వ రాష్ట్రస్థాయి సీనియర్‌ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌ పోటీలను కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ప్రారంభించారు. హాకీ ఆడి, క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారులలో దాగున్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కిషోర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య, హాకీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు చాణుక్యరాజు, జనరల్‌ సెక్రటరీ హర్షవర్ధన్‌, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్‌, ధర్మాంబ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు పల్లెం వేణుగోపాల్‌, ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయికుమార్‌, హాకీ జిల్లా కోచ్‌ హస్సేన్‌, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

పెండింగ్‌ కేసులపై

దృష్టి సారించండి : ఎస్పీ

పుట్టపర్తి టౌన్‌: పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కొత్తచెరువు అప్‌గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్‌ను, ధర్మవరం స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి.. బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. సర్కిల్‌ పరిఽధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, బహిరంగ మద్యపానంపై ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలన్నారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేసి పోలీస్‌ శాఖకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్‌ ఎస్‌ఐలు శ్రీనివాసులు, నారాయణరెడ్డి, ఏఎస్‌ఐ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement