చదువు చెప్పని స్కూల్‌ మాకొద్దు | - | Sakshi
Sakshi News home page

చదువు చెప్పని స్కూల్‌ మాకొద్దు

Jun 13 2026 1:23 PM | Updated on Jun 13 2026 1:23 PM

ధర్మవరం అర్బన్‌: ‘ప్రభుత్వ పాఠశాలలో చదువులు బాగా చెబుతారు, మంచి భోజనం పెడతారని మా పిల్లల్ని ఇక్కడ చేర్పించాం. కానీ ఇక్కడ చదువు చెప్పడంలేదు. భోజనాలు సరిగా పెట్టడం లేదు. మా పిల్లలకు టీసీలు ఇస్తే వేరే స్కూల్లో చేర్పించుకుంటాం’ అని ధర్మవరంలోని శివానగర్‌ మునిసిపల్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం వారు పాఠశాలకు వచ్చి తమ పిల్లల టీసీలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు రాజేష్‌ను అడిగారు. దీంతో అసహనానికి గురైన ఆయన ..‘ మీరే రాసుకోండి’ అంటూ టీసీ పుస్తకాన్ని తల్లిదండ్రుల ముందుకు విసిరారు. ఇందుకు నిరసనగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలు కొన్నేళ్లుగా ఇక్కడ చదువుతున్నా.. వారికి అక్షరం ముక్క కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. హోంవర్క్‌ ఇవ్వడం లేదని, ఉపాధ్యాయులు అసలు చదువే చెప్పడంలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ గోపాల్‌నాయక్‌ పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులు, హెచ్‌ఎంతో మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులుంటేనే మీకు ఉద్యోగాలు ఉంటాయని, వారికి బాగా చదువు చెప్పాలని హెచ్‌ఎంను మందలించారు. టీసీలు ఇప్పిస్తామని తల్లిదండ్రులకు ఎంఈఓ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

టీసీ ఇస్తే వేరేచోట చేర్పించుకుంటాం

శివానగర్‌ మునిసిపల్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

టీసీలు మీరే రాసుకోండని

పుస్తకాలను విసిరేసిన హెచ్‌ఎం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement