జనగణన ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జనగణన ప్రారంభం

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్‌

ప్రశాంతి నిలయం: జనగణనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్‌ తన బంగ్లాలో జనగణన పోర్టల్‌ ద్వారా స్వీయ గణన పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలు పాల్గొని కచ్చితమైన వివరాలను అందించాలన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి స్వీయ గణన చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు.

బడిఈడు పిల్లలందరినీ

స్కూళ్లలో చేర్చాలి

ప్రశాంతి నిలయం: అంగన్‌వాడీ కేంద్రాల్లోని బడిఈడు పిల్లలందరినీ గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ కోసం ఏర్పాటు చేసిన ‘‘బడిలో చేరుదాం... బాగుపడదాం’’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, డీఈఓ కిష్టప్ప గురువారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్‌ఎంటీలు, ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు బాధ్యతగా ఈ ప్రక్రియలో పాల్గొనాలన్నారు.

ప్రతి రికార్డునూ

ఆన్‌లైన్‌ చేయాలి

పుట్టపర్తి అర్బన్‌: రెవెన్యూ కార్యాలయాల్లోని ప్రతి ఫైల్‌నూ కంప్యూటరీకరణ ద్వారా ఆన్‌లైన్‌ చేయాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, రికార్డుల నమోదు, ప్రజాసమస్యల పరిష్కార ప్రక్రియ, కార్యాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భూ వివాదాలు, మ్యుటేషన్లు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లన్నీ వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

పుట్టపర్తి కమిషనర్‌పై

బదిలీ వేటు

పుట్టపర్తి నూతన మున్సిపల్‌

కమిషనర్‌గా శ్రీనివాస్‌

హిందూపురం అసిస్టెంట్‌ కమిషనర్‌గా క్రాంతికుమార్‌

పుట్టపర్తి టౌన్‌: అధికార పార్టీ నేతల అడ్డగోలు బిల్లులకు అడ్డం చెప్పిన పుట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతికుమార్‌పై బదిలీ వేటు పడింది. ఆయన్ను పుట్టపర్తి నుంచి పంపించేయాలని టీడీపీ నేతలు ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఆరు నెలలుగా కమిషనర్‌పై ఒత్తిడి పెంచారు. తాము చెప్పిన మాటలు వినలేదని, తాము పెట్టుకున్న అక్రమ బిల్లులు పాస్‌ చేయడం లేదని కమిషనర్‌ను టార్గెట్‌ చేశారు. చెప్పినమాట వినకపోతే బదిలీపై వెళ్లిపోవాలంటూ ఇప్పటికే స్థానిక ముఖ్యనేత చేత హుకుం జారీ చేయించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే క్రాంతికుమార్‌పై బదిలీ వేటు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా పుట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న క్రాంతికుమార్‌ను హిందూపురం అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

నూతన కమిషనర్‌గా శ్రీనివాస్‌

పుట్టపర్తి మున్సిపల్‌ నూతన కమిషనర్‌గా శ్రీనివాస్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన కర్నూలు నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement