అను‘మతి లేని అంతస్తులు’
సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పట్టణ వ్యాప్తంగా అనుమతులు లేని భవంతులు పదుల సంఖ్యలో నిర్మిస్తున్నా కేవలం నోటీసులు జారీ చేసి వదిలేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భవనాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అడపాదడపా నోటీసులు అందించడమే కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క భవన నిర్మాణం ఆపిన దాఖలాలు లేవు. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆకాశానికి భవంతులు లేపారు. అనుమతులు కొంత.. ఆక్రమణ కొండంత అన్న చందంగా పుట్టపర్తిలో భవనాలు దర్శనం ఇస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి కూటమి నేతలు ఎడాపెడా భవనాలు కట్టేస్తున్నారు. వీటిపై ప్రశ్నిస్తే చాలు బదిలీ వేటు వేస్తుండడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు న్నాయి. ఇదే క్రమంలో కొంత మంది అందినకాడికి దోచుకుంటున్నట్లు తెలిసింది. భవన నిర్మాణాల వద్దకు సిబ్బందిని పంపి నోటీసులు జారీ చేయడం, ‘ఆఫీసుకెళ్లి సార్‌ను కలవాలని చెప్పడం’ అలవాటుగా మారింది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం ద్వారా, వాటికి సక్రమ పద్ధతుల్లో అనుమతులు మంజూరు చేయడం ద్వారా మున్సిపాలిటీకి రూ.కోట్ల ఆదాయం వస్తుంది. అయితే టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం కారణంగా పురపాలిక రాబడికి గండి పడుతోంది. కమిషనర్లు మారుతున్నా టౌన్ ప్లానింగ్ తీరు మారలేదనే విమర్శలు వస్తున్నాయి.
వార్డు సెక్రటరీలతో తతంగం..
టౌన్ ప్లానింగ్ అధికారులు తమ అవినీతి సంపాదనకు వార్డు ప్లానింగ్ సెక్రటరీలను మధ్యవర్తులుగా వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై భవిష్యత్తులో ఎలాంటి విచారణ చేపట్టినా తమకు ఇబ్బంది లేకుండా వార్డు స్థాయిలో సెక్రటరీలను బలి చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించినా ఆ తర్వాత రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నిక్కచ్చి అధికారులు వచ్చినా రాజకీయ ఒత్తిళ్లతో సరిగా విధులు నిర్వర్తించలేని దుస్థితి నెలకొంది.
పుట్టపర్తిలో యథేచ్ఛగా
అక్రమ భవన నిర్మాణాలు
పట్టని టౌన్ ప్లానింగ్ అధికారులు
‘మామూలు’గా పోతున్నారనే విమర్శలు
నోటీసులు ఇస్తున్నాం
పుట్టపర్తి పట్టణంలో అక్రమ నిర్మాణాలకు తావులేదు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోవాల్సిందే. మమ్మల్ని సంప్రదించకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు. అనుమతులు లేని భవన నిర్మాణాలకు సంబంధించి నోటీసులు ఇచ్చాం. –ధర్మరాజు,
టౌన్ ప్లానింగ్ అధికారి, పుట్టపర్తి


