
బాలికల సంరక్షణతోనే మానవ మనుగడ
● ఐసీడీఎస్ పీడీ ప్రమీల
పుట్టపర్తి అర్బన్: బాలికల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని ఐసీడీఎస్ పీడీ ప్రమీల, జిల్లా ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ వీరమ్మ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, సీడీపీఓ జయంతి, సూపర్‌వైజర్ సుజాత, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమాజంలో బాలికలకు ప్రత్యేక స్థానం ఉందని వారిని మంచిగా చూసుకోవాలని, ఆడ, మగ తేడా లేకుండా పెంచి పోషించాలన్నారు. ఆడపిల్లల నిష్పత్తి మరింత పెరగాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కిశోర వికాసం పై నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రమణారెడ్డి, ఏపీఎం లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం వెంకటరమణ, అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
31 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ 409.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పుట్టపర్తి మండలంలో 38.4 మి.మీ, నల్లమాడ మండలంలో 36 మి.మీ వర్షపాతం నమోదైంది. పెనుకొండ మండలంలో 27.8 మి.మీ, గాండ్లపెంట 25.6, అగళి 23.4, ఓడీచెరువు 22.6, సోమందేపల్లి 21.2, రొళ్ల 20.4, గోరంట్ల 18.4, అమడగూరు 17.8, తలుపుల 16.8, తనకల్లు 15.4, కొత్తచెరువు 14.6, హిందూపురం 13.4, బుక్కపట్నం 13.0, తాడిమర్రి 10.8, పరిగి 10.6, నల్లచెరువు 10.2, కదిరి 9.2, మడకశిర 9.2, గుడిబండ 6.2, ధర్మవరం 5.6, సీకేపల్లి 4.4, రొద్దం 3.4, ఎన్‌పీ కుంట 3.0, ముదిగుబ్బ 2.8, బత్తలపల్లి 2.4, రామగిరి 2.4, కనగానపల్లి 2.2, అమరాపురం 1.2, లేపాక్షి మండలంలో 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాకు మరో రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వారు వెల్లడించారు.
వాగులు, వంకలకు జలకళ : తాజా వర్షాలతో వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. పుట్టపర్తి సమీపంలోని ఎనుములపల్లి చెరువు మరువ పారి నీరు పంట పొలాలపై వెళ్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మరువ పారుతున్న ధర్మవరం చెరువు
ధర్మవరం అర్బన్: గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ధర్మవరం చెరువు మరువ పారుతోంది. శుక్రవారం ఉదయం నుంచి చెరువు మొదటి మరువ పారుతుండటంతో పట్టణ ప్రజలు అక్కడకు వెళ్లి సరదాగా గడుపుతున్నారు. మహిళలు మరువ నీటిలో స్నానం చేస్తూ సంతోషంగా గడిపారు.