
ఇన్‌చార్జ్‌లే దిక్కు!
● వేధిస్తున్న సబ్ రిజిస్ట్రార్ల కొరత
● 9 చోట్ల సీనియర్ అసిస్టెంట్లతోనే
కార్యకలాపాలు
● ప్రజలకు తప్పని ఇక్కట్లు
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ల కొరత వేధిస్తోంది. సీనియర్ అసిస్టెంట్లను ఇన్‌చార్జ్‌లుగా నియమించి నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిల్లో ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్ల పక్రియను కొనసాగిస్తున్నారు. అనంతపురంలోని రామ్‌నగర్ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు సైతం లేకపోవడం గమనార్హం. దీంతో ఇటీవల రూరల్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్‌గా ఇస్మాయిల్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పటించారు. రూరల్ కార్యాలయంలో సైతం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లేక రెండు నెలలుగా ఇన్‌చార్జ్‌తో నెట్టుకొస్తున్నారు. కళ్యాణదుర్గం, గుత్తి కార్యాలయాల్లో సైతం సీనియర్ అసిస్టెంట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలిచ్చారు. ఇక కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు మాత్రమే ఉన్నారు. తనకల్లు, చిలమత్తూరు కార్యాలయాలకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో అనంతపురంలోని సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌బాబును ఇన్‌చార్జ్‌గా చిలమత్తూరుకు పంపారు. తనకల్లులో అక్కడే పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌కు బాధ్యతలు ఇచ్చారు.
ప్రజలకు చుక్కలు..
రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్న పనికి సైతం రోజు తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. వెంటనే అధికారులు దృష్టి సారించి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మీని సంప్రదించగా.. ఉమ్మడి జిల్లాలో 9 మంది కొత్త సబ్ రిజిస్ట్రార్ల అవసరం ఉందన్నారు. ఇదే విషయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలోనే కొత్త ఎస్‌ఆర్‌లను కేటాయిస్తారన్నారు. అప్పుడు ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు.